Sputnik V: గుడ్ న్యూస్.. భారత మార్కెట్‌లోకి స్పుత్నిక్-వి వ్యాక్సిన్.. ఎప్పటి నుంచంటే..?

Sputnik V: గుడ్ న్యూస్.. భారత మార్కెట్‌లోకి స్పుత్నిక్-వి వ్యాక్సిన్.. ఎప్పటి నుంచంటే..?

Sputnik V Vaccine(Reuters)

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ల కోరత వేధిస్తున్న వేళ.. కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.

  • Share this:
    దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ల కొరత కారణంగా కొన్ని రోజులు వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేసిన పరిస్థితి. ఇలాంటి సమయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ల కోరత వేధిస్తున్న వేళ.. గుడ్ న్యూస్ చెప్పింది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి(Sputnik V) వ్యాక్సిన్ వచ్చే వారం భారత్ మార్కెట్‌లోని రానున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గురువారం ప్రకటించింది. దేశంలో కోవిడ్-19 పరిస్థితిపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో పాల్గొన్న నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ మాట్లాడుతూ.. ‘స్పుత్నిక్-వి వ్యాక్సిన్ వచ్చే వారం నుంచి భారత మార్కెట్‌లో లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నామని చెప్పడం నాకు సంతోషంగా ఉంది. రష్యా నుంచి ఇప్పటికే భారత్‌కు చేరుకున్న పరిమిత సరఫరా అమ్మకం వచ్చేవారం నుంచి ప్రారంభం అవుతుంది’అని తెలిపారు.

    స్పుత్నిక్-వీ టీకా స్థానిక ఉత్పత్తి జూలైలో ప్రారంభమవుతుందని వీకే పాల్ అన్నారు. దాదాపు 15.6 కోట్ల మోతాదులను తయారు చేయవచ్చని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ రష్యాకు టీకాకు భారత్‌లోని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ పాట్నర్‌గా ఉందన్నారు. విదేశీ టీకాల దిగుమతికి ఒకట్రెండు రోజుల్లో అనుమతి మంజూరు అవుతుందని చెప్పారు. డబ్ల్యూహెచ్‌వో, ఎఫ్‌డీఏ ఆమోదించిన టీకాల దిగుమతికి అనుమతి ఇస్తామని అన్నారు. టీకాల దిగుమతి కోసం ఎలాంటి దరఖాస్తులు పెండింగ్‌లో లేవన్నారు. మరోవైపు భారత్‌లో తమ వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫైజర్ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే.

    ఇక, స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను తొలుత రష్యా గతేడాది ఆగస్టు 11న ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ సామర్థ్యం 91.6 శాతం ఉన్నట్టు Lancet Medical Journalలో ప్రచురితమైంది. 50కి పైగా దేశాల్లో ఈ వ్యాక్సిన్‌ను వినియోగిస్తున్నారు. ఇప్పటికే టీకాలు మాస్కో నుంచి హైదరాబాద్‌ చేరుకున్నాయి. తొలి విడతలో భాగంగా 1.5 లక్షల వయల్స్‌ భారత్‌కు అందాయి. భారత్‌లో స్పుత్నిక్‌-వి క్లినికల్‌ ట్రయల్స్ నిర్వహించిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌కు చేరాయి.
    Published by:Sumanth Kanukula
    First published: