Sophia Robot: రంగంలోకి సోఫియా రోబో.. కరోనా కాలంలో మనుషులకు అండగా..

రోబో సోఫియా

ఎన్నో ప్రత్యేకతలున్న ఈ హ్యూమనాయిడ్ రోబోను ఇప్పుడు కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా వినియోగించనున్నారు. మానవాళికి పెను భూతంలా మారిన కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు వీటిని అధిక సంఖ్యలో తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.

  • Share this:
ప్రపంచంలో పౌరసత్వం పొందిన మొట్టమొదటి ఫీమేల్ రోబోట్ సోఫియాను కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా వినియోగించనున్నారు. హాంకాంగ్‌కు చెందిన హాన్సన్ రోబోటిక్స్ ఈ రోబోట్ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ ఫీమేల్ రోబోను 2016 ఫిబ్రవరి 14న ఆవిష్కరించారు. ఆ తర్వాత టెక్సాస్లోని ఆస్టిన్ సౌత్ వెస్ట్ ఫెస్టివల్ (SXSW)లో దీన్ని మొదటిసారిగా ప్రజల ముందుకు తెచ్చారు. 2017లో, సోఫియా అధికారికంగా పౌరసత్వం పొందింది. దీంతో పౌరసత్వం పొందిన మొదటి రోబోట్గా సోఫియా నిలిచింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం అయిన మొట్టమొదటి ఇన్నోవేషన్ ఛాంపియన్‌గా ఇది ఎంపికైంది. మనుషుల వలే మాట్లాడే ఈ హ్యూమనాయిడ్ రోబోను చూసి సాధారణ వ్యక్తులతో పాటు టెక్ నిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అందుకే సోషల్ మీడియాలో దీనికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

సోఫియాకు 'సోఫియా థీ రోబోట్' పేరుతో ప్రత్యేకమైన ట్విట్టర్ ప్రొఫైల్ కూడా ఉంది. ఈ అకౌంట్ నుంచి కొత్త అప్‌డేట్స్ అందిస్తుంది. ఇక సోఫియా 50 కంటే ఎక్కువ ముఖ కవళికలను ప్రదర్శించగలదు. అంతేకాక, ఇది సునాయాసంగా ప్రసంగించగలదు. ఈ రోబో ఇదివరకే అనేక సమావేశాలలో కనిపించి.. అనేక పత్రికా సమావేశాల్లో కూడా మాట్లాడింది. 2019 అక్టోబర్ నెలలో ఇండోర్‌లో జరిగిన అంతర్జాతీయ రౌండ్ స్క్వేర్ సమావేశానికి సోఫియా హాజరై వాతావరణ మార్పు, ఇంధన పరిరక్షణపై ప్రసంగించింది. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ హ్యూమనాయిడ్ రోబోను ఇప్పుడు కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా వినియోగించనున్నారు. మానవాళికి పెను భూతంలా మారిన కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు వీటిని అధిక సంఖ్యలో తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఒంటరితనాన్ని దూరం చేసే సోఫియా:

కోవిడ్–19 సంక్షోభం కారణంగా ప్రజల జీవన శైలిలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రజలు ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతుండటం వల్ల మునుపటితో పోలిస్తే టెక్నాలజీ వినియోగం బాగా పెరిగింది. అంతేకాక, పని ప్రదేశాల్లో మానవుని రక్షణార్థం ఆటోమేషన్ టెక్నాలజీ పరికరాల ఉపయోగం కూడా పెరిగింది. కోవిడ్–19 వల్ల మానవ సంబంధాల్లో గణనీయమైన మార్పులొచ్చి, ఇతరులతో మాట్లాడే పరిస్థితులు తగ్గిపోయాయి. తద్వారా, మానసిక ఆందోళన కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో మనిషిని పోలి ఉండే ‘సోఫియా’ హ్యూమనాయిడ్ రోబోను కోవిడ్–19 నుంచి రక్షణగా ఉపయోగించనున్నారు. కోవిడ్–19తో బాధపడుతున్న వ్యక్తులు ఒంటరితనాన్ని ఫీల్ అవ్వకుండా వారిలో మాటలు కలిపే ఈ రోబో.. వారు చెప్పిన పనులన్నింటినీ చేస్తుంది.

దీనిపై హాన్సన్ రోబోటిక్స్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ హాన్సన్ రాయిటర్స్ మాట్లాడుతూ "కోవిడ్–19కు వ్యతిరేకంగా ప్రజలను సురక్షితంగా ఉంచడానికి సోఫియా వంటి రోబోల అవసరం ఎంతో ఉంది. మేం రూపొందించిన రోబోలు మానవుడి వలే ఉండటం ప్రత్యేకమైన విషయంగా చెప్పవచ్చు. కరోనా సమయంలో ప్రజలు ఒంటరిగా ఫీలవుతున్నారు. ఈ ఒంటరి ఫీలింగ్ నుంచి వారిని బయటపడేయటానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది." అని ఆయన అన్నారు. హాన్సన్ రోబోటిక్స్ 2021 మొదటి భాగంలో వేలాది సోఫియాను విక్రయించాలని యోచిస్తోంది. అయితే, ఇది ఎన్ని రోబోలను ఉత్పత్తి చేయనున్న విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.
Published by:Shiva Kumar Addula
First published: