Lock Down: గ్రామీణ ఫ్రాంతాల్లో 14 రోజుల లాక్ డౌన్.. మూత పడుతున్న సరిహద్దులు

గ్రామీణ ప్రాంతాల్లో 14 రోజుల లాక్ డౌన్

ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన కరోనా వైరస్.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలపైనా పంజా విసురుతోంది. దీంతో 14 రోజుల లాక్ డౌన్ తప్పని సరైంది. చాలా గ్రామాల్లో ఇప్పటికే నో ఎంట్రీ బోర్డులు వెలుస్తున్నాయి.

 • Share this:
  కరోనా రక్కసి ఏపీపై విరుచుకుపడుతోంది. కర్ఫ్యూను కఠినంగా ఆమలు చేస్తున్నా కేసులు సంఖ్య తగ్గడం లేదు. ప్రతి రోజు 20 వేలకుపైగా మంది కరోనా బారిన పడుతున్నారు. అయితే ఒకప్పుడు పట్టణాల్లోనే ఎక్కువ కేసులు ఉండేవి. కానీ సెకెండ్ వేవ్ గ్రామీణ ప్రాంతాలను వదలడం లేదు. చాలా గ్రామాలను కరోనా వెంటాడుతోంది. పరీక్షలు చేసుకోకపోయినా.. కరోనా లక్షణాలు ఎక్కువమందిలో కనిపించడంతో భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కరోనాపై పోరుకు పల్లెలు కట్టడి చర్యలు మొదలెట్టాయి. ఇప్పటికే చాలా గ్రామాలు కట్టుదిట్టమైన కట్టుబాట్లు పెట్టుకుని కరోనా ఫ్రీ గ్రామాలుగా నిలిచాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి గ్రామాలు కొన్ని ఉన్నాయి. వాటి స్ఫూర్తితో.. ఇతర గ్రామాలు ఏకం ఆంక్షలను మరింత కఠినం చేస్తున్నాయి. స్వీయ నియంత్రణయే శ్రీరామరక్షగా భావిస్తున్నాయి. గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్ డౌన్ ను ప్రకటించుకుంటున్నాయి.

  వైరస్‌ సెకెండ్ వేవ్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు పలు గ్రామాలు ప్రభుత్వ ఆంక్షలను పాటిస్తూ.. స్వయ ప్రకటిత లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. కొన్నిచోట్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నేరుగా రంగంలోకి దిగుతుండగా, మరికొన్ని చోట్ల గ్రామ అభివృద్ధి కమిటీలు, సంఘాలు, కులపెద్దలు కట్టుబాట్లు విధిస్తున్నారు. గ్రామానికి వచ్చే ప్రధాన రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. తమ ఊరి నుంచి ఎవరూ బయటకు రారు.. తమ గ్రామంలోకి ఎవరూ రాకూడదు అంటూ బోర్డులు పెడుతున్నారు. సరిహద్దులను మూసేస్తున్నారు.

  సాధారణంగా కరోనా లక్షణాలు ఉన్నవారికి 14 రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉంచి.. తగిన చికిత్స అందిస్తే కరోనా నుంచి కోలుకుంటున్నారు. దీంతో ఆయా గ్రామాలు సైతం కరోనాను ఓడించేందుకు కనీసం 14 రోజుల లాక్ డౌన్ విధించుకుంటున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా కొత్తపట్నంలోని పల్లెపాలెం గ్రామ పెద్దలు వినూత్న రీతిలో కట్టడిని అమల్లోకి తెచ్చారు. గ్రామంలో పలువురు వైరస్‌ బారిన పడుతుండటం, ఇరుగు పొరుగు గ్రామాల వారు విచ్చలవిడిగా సంచరిస్తుండటంతో తమ గ్రామంలోకి బయటివ్యక్తులు రాకుండా చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి కాపలా ఉంచారు.

  సముద్రతీరంలో ఉన్న కొత్తపట్నం పల్లెపాలెంలో చేపల కోసం పలు గ్రామాల ప్రజలు నిత్యం వచ్చిపోతుంటారు. దీంతో కేసులు ప్రబలకుండా ఈ కట్టడి విధానాన్ని అమలు చేస్తున్నారు. మరోవైసు ఏఫ్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 వరకు చేపల వేటఫై ప్రభుత్వం నిషేధం విధించడంతో పనులు లేక మత్య్సకారులు కొంతమంది చుట్టుపక్కల గ్రామాలకు పనులకోసం వెళుతున్నారు. అలా పనుల కోసం వచ్చే వారితో కరోనా ప్రబలే ప్రమాదం ఉందని భావించిన గ్రామ పెద్దలు సరిహద్దును మూసేశారు. పల్లెపాలెంకు చెందిన మత్స్యకారులతో పాటు ఇతర గ్రామస్థులు ఎవరూ పక్క గ్రామాలకు పనుల నిమిత్తం వెళ్లకూడదని చాటింపు వేయించారు. ఈ కట్టుబాటును మత్స్యకార కాపుపెద్దలతో పాటు ఇతర గ్రామ పెద్దలు ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు.

  పల్లెపాలెం గ్రామ కాపులు, పెద్దల కట్టుబాటులో భాగంగా గ్రామానికి వచ్చే ప్రధాన రహదారి శివారులో చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేశారు. ఈ చెక్‌పోస్ట్‌ దగ్గర కొంతమంది గ్రామస్తులను కాపలా ఉంచారు. ఇతర గ్రామాల నుంచి వచ్చేవారిని అడ్డుకుని వెనక్కి పంపేస్తున్నారు. అలాగే గ్రామానికి చెందిన వారు ఎవరు బయటకు వెళ్లాలన్న అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తున్నారు. గ్రామ పెద్దలు నిర్ణయించిన ప్రకారం ఊరి శివారులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ దగ్గర కాపలా కాస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ఇది ఊరిబాగుకోసం, కరోనా కట్టడికోసం కాబట్టి అందరూ సహకరించాలని కోరుతున్నారు.
  Published by:Nagesh Paina
  First published: