శానిటైజరే మద్యం... తెగ తాగుతున్నారుగా... ఇలాగైతే ఎలా?

శానిటైజరే మద్యం... తెగ తాగుతున్నారుగా... ఇలాగైతే ఎలా?

శానిటైజర్ తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసి కూడా దాన్నే ఎందుకు తాగుతున్నారు? ఇది వ్యసనంలా ఎందుకు మారింది?

 • Share this:
  ఆంధ్రప్రదేశ్‌లో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. మందుబాబులతో మద్యం అలవాటు మాన్పించాలని ప్రభుత్వం మద్యం ధరలను దాదాపు రెట్టింపు చేసింది. సర్కారు తలిచింది ఒకటైతే... వాస్తవంలో జరుగుతున్నది మరొకటైంది. ఎప్పుడైతే... మద్యం ధరలు పెరిగిపోయాయో... మందు బాబులు... హ్యాండ్ శానిటైజర్లను తాగడం మొదలుపెట్టారు. ఇలా ఎందుకంటే... ఆ శానిటైజర్లలో ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి... అది తమకు కిక్ ఇస్తుందని అంటున్నారు. అంతంత రేటు పెట్టి మద్యం కొనుక్కునే బదులు... శానిటైజర్ బాటిల్ కొనుక్కోవడం బెటరంటున్నారు. శానిటైజర్ తాగితే... ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కదా అంటుంటే... వేరే దిక్కులేదు. ఏం చెయ్యాలి. మందు మానలేం. కాబట్టే ఇలా కానిచ్చేస్తున్నాం అంటున్నారు కొందరు మందుబాబులు.

  శానిటైజర్లు వచ్చిన కొత్తలో చాలా రేటు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు చాలా మంది వాటిని తయారుచేస్తుండటంతో... వాటి ధర దిగొచ్చింది. అదే సమయంలో మద్యం ధరలు కొండెక్కాయి. పైగా శానిటైజర్ నుంచి వచ్చే వాసన మత్తుగా గమ్మత్తుగా ఉంటోందంటున్నారు మందుబాబులు. ఇలాంటి దృశ్యాలు చూస్తున్న ప్రజలు... "ఇదెక్కడి గోలరా నాయనా... మద్యం బదులు శానిటైజర్ తాగడమేంటిరా బాబూ" అనుకుంటున్నారు.

  ప్రకాశం జిల్లా... కురిచేడులో ఇలాగే శానిటైజర్లు తాగడంతో... 13 మంది చనిపోగా... శనివారం మరో ఇద్దరు చనిపోయారు. ఇంకో ముగ్గురి పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. అందరూ పేదలే. కూలిపనులు చేసుకొని బతికేవాళ్లు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ విషయం తెలిసి కూడా మందు బాబులు శానిటైజర్లను తాగేస్తున్నారంటే... వాళ్లు దానికి ఎంతలా అలవాటు పడిపోయారో అర్థం చేసుకోవచ్చు.

  అసలు శానిటైజర్లు తెచ్చింది దేనికి? కరోనా వైరస్ రాకుండా కాపాడుకోవడానికి. కానీ... ఇప్పుడు మందు బాబులు వీటిని ఈజీగా కొనుక్కొని... సోడాలో మిక్స్ చేసుకొని... ఆనందంగా తాగుతున్నారు. కడప నగరంలో చాలా మంది ఇలా తాగుతూ... ప్రాణం పోయినా పర్వాలేదు... చచ్చే వరకూ కిక్ ఉంటే చాలు అంటున్నారు. ఇదో ప్రమాదకర పరిణామం. దీన్ని ఆపకపోతే... ఇదో వ్యసనంలా మారుతుందని డాక్టర్లు చెబుతున్నారు. మరి ప్రభుత్వమే దీనికి పరిష్కారం చూడాల్సి ఉంటుంది.
  Published by:Krishna Kumar N
  First published: