కోవిడ్ మహమ్మారి చిన్న పిల్లలపై కూడా ప్రభావం చూపుతోంది. థర్డ్ వేవ్ సంకేతాలు ఇప్పటికే కనిపిస్తోన్న తరుణంలో పంజాబ్‌లో వివిధ పాఠశాలల్లో ర్యాండమ్ టెస్టులు నిర్వహించారు. వీటిలో వారం వ్యవధిలో 30 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డట్టు తేలింది. దీంతో పాఠశాలలను నిర్వహించే వ్యవధిని వెంటనే తగ్గించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ టైమ్ గ్యాప్స్‌లో.. తక్కువ మంది విద్యార్థులను బ్యాచ్‌లుగా చేసి తరగతులు నిర్వహించాలని సూచిస్తున్నారు. వచ్చే నెలలో పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యే అవకాశముందని, ఆలోపు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
‘పిల్లలు ఇప్పటి వరకు ఇళ్ల వద్దే చదువుకున్నారు. ఇప్పుడు పాఠశాలలు తిరిగి ప్రారంభించాలనుకుంటే సరైన ప్రణాళికతో నిర్వహించాలి. విద్యార్థులను కొన్ని బ్యాచ్‌లుగా విభజించి, తక్కువ వ్యవధిలో తరగతులు నిర్వహించాలి. ఎక్కువ సేపు పాఠశాలల్లో ఉండటం వల్ల విద్యార్థులకు వైరస్ సోకే అవకాశం అధికంగా ఉంటుంది’ అని లూథియానాకు చెందిన పిల్లల వైద్య నిపుణులు ఒకరు తెలిపారు.
పంజాబ్‌లో జులై 26 నుంచి 10, 12వ తరగతి విధ్యార్థులకు పాఠశాలలను తిరిగి ప్రారంభించారు. ఆగస్టు 2 నుంచి మిగిలిన తరగతులు ప్రారంభించారు. అయితే పిల్లల్లో వైరస్‌ను తట్టుకునే శక్తి గురించి ప్రభుత్వం మార్గదర్శకాల్లో ప్రస్తావించకపోవడం గమనార్హం. ఉదయం వేళల్లో లేదా పాఠశాల ముగిసిన తర్వాత రద్దీ సర్వసాధారణంగా మారింది. దీంతో త్వరలో మాలౌట్, బతిండా లుథియానా, ఫరీద్ కోట్ జిల్లాల్లో సామాజిక దూరం ఆంక్షలు విధిస్తారని నివేదికలు సూచిస్తున్నాయి.
విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడం రానున్న విపత్తును సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. "చాలా పాఠశాలలను రోజుకు 6 గంటలు ఓపెన్ చేస్తున్నారు. విద్యార్థులు ఒకే టాయ్ లెట్లను వినియోగించడం, కలిసి భోజనం చేయడం, నీటి కుళాయిల్లో నీరు తాగడం లాంటివి చేస్తారు. కాబట్టి తక్కువ మందితో బ్యాచ్‌ల వారీగా తరగతులను నిర్వహించాలి. తరగతి గదులను శుభ్రపరచడానికి స్ప్రింకర్లను ఉపయోగించాలి. సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి" అని అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా మాల్వా బ్రాంచ్ ఛైర్మన్ విత్తుల్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు.
ఇదే సమయంలో పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు భోజన సమయాల్లో తమ స్నేహితులతో కలిసి పంచుకునే విధానం ఉంటుందని, అంతేకాకుండా ఈ సమయంలో మాస్క్‌లు కూడా తీసివేస్తారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాస్క్ ధరించడం ఆచరణాత్మకంగా సాధ్యం కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.