కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ కుటుంబంలో ఆరుగురికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఎంపీ సంజీవ్ కుమార్ స్వయంగా వెల్లడించారు. అయితే, తనకు రాలేదని, తన సోదరుల కుటుంబంలో ఆరుగురికి కరోనా వచ్చిందని చెప్పారు. వారంతా కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారని, ఎంచక్కా సినిమాలు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు. కరోనా వచ్చి తగ్గితేనే అందరికీ రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. ‘కర్నూలులో కరోనా ఎక్కువైందని ప్రజలు భయపడుతున్నారు. వారికి వాస్తవ పరిస్థితి చెప్పడానికి నేను ముందుకొచ్చా. తాజాగా వైసీపీ ఎంపీ కుటుంబంలో ఆరుగురికి కరోనా వచ్చిందని మీడియాలో వచ్చింది. వారు చెప్పింది కరెక్టే. అయితే, అది మా బ్రదర్స్ కుటుంబంలో ఆరుగురికి కరోనా వచ్చింది. కర్నూలు జనరల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అందరూ హాయిగా ఉన్నారు. సినిమాలు చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఎవరూ రోగం గురించి భయపడొద్దు. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. కోవిడ్ 19 అంటేనే మహమ్మారి అని, అమెరికా, స్పెయిన్ గురించి భయపడుతున్నారు. మన దగ్గర అలాంటి పరిస్థితి రాదని నేను ఘంటాపథంగా చెప్పగలను.’ అని సంజీవ్ కుమార్ అన్నారు.
స్వతహాగా భారతీయుల శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. మన చిన్నప్పుడు బీసీజీ ఇంజెక్షన్ ఇస్తారని, అది టీబీ కోసం ఇస్తారన్నారు. అది కూడా కరోనా నుంచి కట్టడి చేయవచ్చని సైంటిస్టులు చెబుతున్నారన్నారు. చిన్నప్పటి నుంచి మన శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడుతూనే ఉంటుందని, శరీరం కూడా అందుకు అనుకూలంగా మార్చుకుంటుందన్నారు. ఏపీలో మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉందన్నారు. కరోనా కేసులను దాచి పెట్టాల్సిన అవసరం లేదని సంజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు. తాజాగా డాక్టర్లు చెబుతున్న హెర్డ్ ఇమ్యూనిటీ గురించి సంజీవ్ కుమార్ వివరించారు. గుంపుల్లో ఎంతమందికి ఎక్కువ రోగనిరోధక శక్తి పెరిగితే, జబ్బు నుంచి కోలుకుంటేనే సమాజం బయటపడుతుందన్నారు. అయితే, కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకే లాక్ డౌన్ అమలు చేస్తున్నారన్నారు. లాక్ డౌన్‌ను దశలవారీగా ఎత్తివేయాలని సంజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Coronavirus, Covid-19, Kurnool