Free Oxygen: ఆక్సిజన్ కావాలా.. ఆ చెట్టు కింద నిల్చోండి..ఇస్తుంది.. మరీ ఇంత దారుణమా?

ప్రతీకాత్మక చిత్రం

ఆక్సిజన్​ ప్లాంట్​ వద్దకు రోగుల కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఆసుపత్రికి ఆక్సిజన్​ సరఫరా గురించి యాజమాన్యంలో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని అనుమతించలేదు. వారితో దారుణంగా వ్యవహరించారు.

  • Share this:
భారత్‌లో రెండో దశ కరోనా వ్యాప్తితో కోవిడ్ రోగులకు ఆసుపత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. ఒకవేళ బెడ్​ దొరికినా.. సకాలంలో ఆక్సిజన్ లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు కొన్ని చోట్ల వైద్యాధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాధిత కుటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురిచేస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​ నియోజవర్గ పరిధిలో జరిగిన ఒక సంఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. స్థానిక ఆసుపత్రిలో ఆక్సిజన్​ సరఫరా నిలిచిపోవడంతో.. ప్రయాగ్​రాజ్​ ఎమ్మెల్యే హర్షవర్ధన్​ వాజ్​పేయీకి చెందిన ఆక్సిజన్​ ప్లాంట్​ వద్దకు రోగుల కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఆసుపత్రికి ఆక్సిజన్​ సరఫరా గురించి యాజమాన్యంలో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని అనుమతించలేదు. వారితో దారుణంగా వ్యవహరించారు. ‘ఆక్సిజన్​ అవసరమైతే కరోనా రోగులను తీసుకెళ్లి రావి చెట్టు కింద కూర్చోబెట్టుకోండి. ఆక్సిజన్​ లెవల్స్​ పెరుగుతాయి’ అంటూ ఉచిత సలహాలు ఇచ్చారు.

ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల రోగుల బంధువులు ఆందోళనకు దిగారు. మా దుస్థితిపై కనీసం కనికరం లేకుండా పోలీసులు ఇలా వ్యవహరించడం దారుణమని వాపోతున్నారు. ఆక్సిజన్ సరఫరా కోసం చూస్తున్న ఒక వ్యక్తి మాట్లాడుతూ.. ‘‘మేము ఎకడికెళ్లినా ఆక్సిజన్ దొరకడం లేదు. ఆసుపత్రులు, ఆక్సిజన్​ ప్లాంట్ల ఎదుట ‘నో స్టాక్​’ బోర్డులు పెట్టేస్తున్నారు. కనీసం ప్లాంట్ల యాజమాన్యంతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదు” అని చెప్పాడు. ప్రయాగ్​ రాజ్​ నుంచి లక్నో వరకు ఉన్న అనేక ఆసుపత్రుల్లో ఆక్సిజన్​ కోసం ప్రయత్నించానని, అయినా ఎక్కడా లభించలేదని తన గోడు వెల్లబోసుకున్నాడు.

ఆసుపత్రుల ముందు నోస్టాక్​ బోర్డులు
కరోనా విజృంభన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో ఆక్సిజన్​కు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ క్రమంలోనే లక్నో సహా ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 75 జిల్లాల్లో 47 జిల్లాలకు పీఎం కేర్స్​ ఫండ్​ నుంచి ఆక్సిజన్​ను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇతర ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్లను సైతం తరలించింది అయినప్పటికీ, రాష్ట్రంలో చాలాచోట్ల ఆక్సిజన్​ కొరతతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్​లో కరోనా తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది.
Published by:Shiva Kumar Addula
First published: