Corona: కరోనా దెబ్బ.. రెస్టారెంట్లుగా మారుతున్న విమానాలు
సింగపూర్ ఎయిర్ లైన్స్
Corona: కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థల కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయం కోసం సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఏకంగా తమ విమానాలను రెస్టారెంట్లుగా మార్చింది.
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థల కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. ఎయిర్‌లైన్స్ సంస్థలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు ఇతర దేశాలకు విమాన రాకపోకలకు అనుమతిస్తున్నాయి. ఈ రంగం పుంజుకోవడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు డబ్బు సంపాదించేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా టూరిజం సేవలందించేందుకు ‘ఫ్లైట్స్ టూ నో వేర్’ సర్వీసులను ప్రవేశపెట్టాయి. కానీ సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఏకంగా తమ విమానాలను రెస్టారెంట్లుగా మార్చింది.
నష్టాలను పూడ్చుకునేందుకే..
కోవిడ్19 కారణంగా సర్వీసులు ఆగిపోవడం వల్ల సింగపూర్ ఎయిర్‌లైన్స్ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. భారీగా వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి ఇప్పుడు ఆ సంస్థ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించింది. తమ సంస్థకు చెందిన రెండు A380 విమానాల్లో ఒకదాన్ని రెస్టారెంట్‌గా మార్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణీకుల జెట్‌గా దీనికి పేరు ఉంది. ప్రయాణ సమయంలో అందించే ఆహారాన్నే కస్లమర్లకు లంచ్, డిన్నర్లో అందిస్తామని ప్రకటించింది. ఈ విమానంలో భోజనం ఖరీదు చాలా ఎక్కువ. ఒక్క మీల్స్‌కు 642 సింగపూర్ డాలర్లు(470 అమెరికన్ డాలర్లు) చెల్లించాలి.
మంచి డిమాండ్
ఈ డబుల్ డెక్కర్ జెట్లను సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయంలో ఉంచారు. ఈ సోమవారం ప్రకటించిన ప్లేన్ ఫుడ్(plane food) ఆఫర్ ఎంతోమందిని ఆకర్షించింది. ఆశ్చర్యకరంగా కస్టమర్లకు అందుబాటులో ఉంచిన మొత్తం 900 సీట్లు బుకింగ్ ప్రారంభమైన అరగంటలోనే అమ్ముడయ్యాయి. అక్టోబర్ 24, 25 తేదీల్లో A380 విమానంలో భోజనం కోసం ఈ బుకింగ్‌లను సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.
సేవల పొడిగింపు..
అనుకోకుండా ఏర్పడిన ఈ అధిక డిమాండ్ ను సొమ్ము చేసుకునే ప్రయత్నాల్లో సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఉంది. తమ విమానంలో ప్లేన్ ఫుడ్ రెస్టారెంట్ సర్వీసులను మరో రెండు రోజులు పొడిగిస్తామని ప్రకటించింది. ఇప్పుడు మొత్తం నాలుగు తేదీల్లో కస్టమర్లు A380 ప్యాసింజర్ జెట్ రెస్టారెంట్లో భోజనం(లంచ్ లేదా డిన్నర్) చేయవచ్చు. ఇక్కడి ఆహారంలో ఫస్ట్ క్లాస్ విభాగంలో అందించే ఫోర్ కోర్స్ మీల్స్ అత్యంత ఖరీదైనది. ఎకానమీ క్లాస్‌లో అందించే త్రీ కోర్స్ మీల్స్ తక్కువ ధర(53 సింగపూర్ డాలర్లు)లో లభిస్తుంది.
కొవిడ్ మార్గదర్శకాలతోనే..
కరోనా నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. సామాజిక దూరానికి అనుగుణంగా సగం సీట్లనే కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. విమానంలో ప్రయాణిస్తున్న అనుభూతిని పొందడంతో పాటు ప్లేన్ ఫుడ్‌ను కస్లమర్లు ఆస్వాదించవచ్చు. ప్లేన్ ఫుడ్ తినాలనుకునేవారికి ఈ సంస్థ హోమ్ డెలివరీలను కూడా అందిస్తోంది. గతంలో ప్రారంభించాలనుకున్న ‘ఫ్లైట్స్ టూ నో వేర్’ షార్ట్ జర్నీ టూరిజం సర్వీసులను ఆ సంస్థ ఆపేసింది. ఇవి పర్యావరణంపై ప్రభావం చూపే అవకాశముందనే ఉద్దేశంతో ఆ ప్రణాళికలను విరమించుకుంది.