హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

UK Virus: బ్రిటన్ నుంచి తెలంగాణ వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా.. 

UK Virus: బ్రిటన్ నుంచి తెలంగాణ వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ఏడుగురికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తరకం వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు.

ఇంకా చదవండి ...

  బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ఏడుగురికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తరకం వైరస్ మీద ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు యూకే నుంచి, యూకే మీదుగా తెలంగాణకు 1200 మంది వచ్చారని, అందులో 846 మందిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించగా 7 గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు మంత్రి ఈటల రాజేందర్‌కి తెలిపారు. వీరిలో ఏ రకం వైరస్ ఉందో  తెలుసుకోవడానికి CCMB ల్యాబ్ కి పంపినట్లు అధికారులు తెలిపారు. వీరందరిని ప్రత్యేకంగా పరిశీలన చేస్తున్నట్లు, పాజిటివ్ వచ్చిన వారిని కలిసిన వారందరినీ కూడా ట్రేస్ చేస్తున్నట్లు తెలిపారు. నెగెటివ్ వచ్చిన వారిని సైతం మానిటర్ చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ కొత్త రకం వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది అని వైద్య నిపుణులు చెప్తున్న నేపద్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. రాబోయే క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకలు ఇంటికే పరిమితం అయ్యి జరుపుకోవాలని సూచించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించిన అన్ని జాగ్రత్తలు పాటించాలని కోరారు. మాస్క్, భౌతిక దూరం, తరచూ చేతులు శుబ్రపరుచుకోవడం మరిచిపోవద్దని కోరారు.

  కరోనా వైరస్ భయం పూర్తిగా పోవాలంటే వాక్సిన్ ఒక్కటే మార్గంగా భావిస్తున్నారు కాబట్టి, వాక్సిన్ మన రాష్ట్రానికి అందిన వెంటనే ప్రజలకు అందించేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వాక్సిన్ రవాణా, నిల్వ, పంపిణీ అంశాలపై అధికారులతో చర్చించారు. వాక్సిన్ వేయడానికి పది వేల మంది వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. వీరంతా రోజుకు వంద మందికి టీకా వేస్తే పది లక్షల మందికి రోజుకి వాక్సిన్ వేయగలమని తెలిపారు. మొదటి దశలో 70 నుండి 80 లక్షల మందికి టీకా వేయడానికి ప్రణాళిక సిద్దం చేశామని తెలిపారు. హెల్త్, పోలీస్, మున్సిపల్, ఫైర్ సిబ్బందితో పాటు వయసు మీద పడిన వారికి మొదటి దశలో టీకా ఇవ్వనున్నారు. మొదటి డోసు వేసిన 28 రోజుల తరువాత రెండో డోసు వేయాలి. అందుకు అవసరం అయిన సాఫ్ట్ వేర్ సిద్దంగా ఉంచామని తెలిపారు. వాక్సిన్ అందిస్తున్న సెంటర్స్ లో తాగు నీరు, టెంట్లు, చైర్లు సిద్దం చేయాలని తెలిపారు. వాక్సిన్ సరఫరాకు అవసరం అయిన కోల్డ్ చైన్, ఎవరికి ఎక్కడ వాక్సిన్ అందించాలి అనే మ్యాపింగ్, సిబ్బందికి ట్రైనింగ్, వాక్సిన్ సెంటర్ లలో అవసరం అయిన సదుపాయాలు ఎక్కడ లోపం లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

  కరోనా లాంటి మహమ్మారులను తట్టుకోవాలంటే ప్రజారోగ్య వ్యవస్థను పూర్తి స్థాయిలో బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మంత్రి అన్నారు. సీఎం కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ఆదేశాలతో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 11 CT SCANS, 3 MRI MISSIONS లను వెంటనే కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా వీటిని అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. నాణ్యమైన వైద్య పరికరాలు తక్కువ ధరకు వచ్చేలా చూడాలని కోరారు.

  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఆపరేషన్ థియేటర్స్ అన్నిటినీ ఆధునిక సాంకేతిక పద్దతులకు అనుగుణంగా నవీకరించాలని ఆదేశించారు. మరో ఆరు నెలల్లో వీటిని సిద్దం చేయాలని సూచించారు. ఇందుకు ముప్పై కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అధికారులు అంచనాలు వేశారు. బస్తీ దవాఖానాలు విజయవంతం అయిన నేపథ్యంలో.. అక్కడికి వచ్చిన పేషంట్లకు  వైద్య పరీక్షల కోసం 8 డయాగ్నస్టిక్ మినీ  హబ్ లను సిద్దం చేశారు. ఇక్కడ రక్త పరీక్షలతో పాటు X-RAY, ULTRA SOUND, ECGపరీక్షలు చేయనున్నారు. ఈ నెలాఖరు నుంచి ఈ హబ్ లను ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. డయాలసిస్ సెంటర్ ల సంఖ్యను, మిషన్ల సంఖ్యను కూడా పెంచాలని ఆదేశించారు. డయాలసిస్ కోసం సుదూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండా చూడాలని సూచించారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Coronavirus, Telangana, UK Virus

  ఉత్తమ కథలు