2021.. వస్తూనే శుభవార్తను తెచ్చింది. మన దేశంలో కరోనా వ్యాక్సీన్ వచ్చేసింది. భారత ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సందర్భం వచ్చింది. అత్యవసర సమయంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను వినియోగించేందుకు షరతులతో కూడిన అనుమతులను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మంజూరు చేసింది. ఈ రెండు టీకాలను ఇక నుంచి అత్యవసర సమయాల్లో వినియోగిస్తారు. డీజీసీఐ ప్రకటన చేసిన వెంటనే కోవిషీల్డ్ టీకాను తయారుచేసిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్పందించింది. హ్యాపీ న్యూ ఇయర్ అని ఆ సంస్థ సీఈవో అడర్ పూనావాలా ట్వీట్ చేశారు. వ్యాక్సీన్ తయారీ కోసం సీరం పడిన కష్టానికి ఎట్టకేలకు ఫలితం దక్కిందని ఆయన అన్నారు.
భారత్‌లో మొట్ట మొదటి కోవిడ్ వ్యాక్సీన్ కోవిషీల్డ్‌కు ఆమోదం లభించిందని అడర్ పూనావాలా పేర్కొన్నారు. ఇది సురక్షితమైనది, సమర్థవంతమైదని.. మరికొన్ని వారాల్లోనే అందరికీ అందుబాటులోకి రానుందని వెల్లడించారు. ఈ సందర్భంగా కోవిషీల్డ్ వ్యాక్సీన్ ఫొటోలను పంచుకున్నారు. తెలుగు రంగు బాటిల్‌పై ఆకుపచ్చ రంగు బ్రాండ్ లోగోను ముద్రించారు. 5 ఎం.ఎల్. బాటిల్‌తో 10 డోస్‌లు తీసుకోవచ్చని సీసపై ముద్రించిన వివరాల ఆధారంగా తెలుస్తోంది.
కోవిషీల్డ్‌కు అనుమతి లభించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్, ఐసీఎంఆర్, డీసీజీఐ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రజెనికా సంస్థ, బిల్ గేట్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సీరమ్ సీఈవో పూనావాల. కాగా, కోవిషీల్డ్‌ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోంది. ఈ వ్యాక్సీన్‌ను ఆస్ట్రజెనికాతో పాటు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా తయారుచేశాయి. కోవిషీల్డ్ పేరుతో ఇండియాలో తయారుచేసేందుకు ఆయా సంస్థలతో సీరం ఒప్పందం కుదుర్చుకుంది.
Published by:Shiva Kumar Addula
First published:January 03, 2021, 12:42 IST