కరోనా వైరస్ (Corona Virus). దాదాపు రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న భయంకరమైన వైరస్. కోట్లాది మంది దీని భారిన పడగా.. లక్షలాది మంది ఈ మహమ్మారికి బలయ్యారు. దీని గురించి ప్రపంచానికి తెలిసినప్పటి నుంచి, దీన్ని నిరోధించే చర్యలపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలో SARS-CoV-2 వ్యాప్తిని, వైరల్ లోడ్‌ను తగ్గించగల ఒక చూయింగ్ గమ్ ను అభివృద్ధి చేశారు పెన్సిల్వేనియా యూనివర్సిటీ పరిశోధకులు. మొక్కలకు సంబంధించిన పదార్థాలతో రూపొందించిన ప్రోటీన్‌ను ఈ బబుల్ గమ్ లో కలిపారు. ఇది కరోనా వైరస్ కు కళ్లెం వేయగలదని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఈ బబుల్ గమ్ ను నములుతున్నప్పుడు కరోనా బాధితుల లాలాజలంలో కలిసే ప్రోటీన్, వైరల్ లోడ్‌ను తగ్గిస్తుంది. ఇది వైరస్ ప్రసారాన్ని సైతం తగ్గించగలదని పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనాన్ని మాలిక్యులర్ థెరపీ జర్నల్‌లో ప్రచురించారు.
కరోనా వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు లేదా మాట్లాడినప్పుడు, వైరస్‌లో కొంత భాగం బయటకు వెళ్తుంది. వివిధ వాహకాల ద్వారా వైరస్ ఇతరులకు సోకుతుంది. అయితే ఈ సరికొత్త చూయింగ్ గమ్ మాత్రం లాలాజలంలోని వైరస్‌ను లక్ష్యంగా చేసుకుంటుంది. దాన్ని ACE2 ప్రోటీన్‌తో బంధించి, వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. మనుషులకు సోకే వైరస్ శరీర కణాలకు అంటుకుంటుంది. ఆ వైరస్ ACE2 ప్రొటీన్ ద్వారానే మానవ కణంలోకి ప్రవేశిస్తుంది. దీంతో ఈ ప్రోటీన్పైనే పరిశోధనలు ప్రయోగాలు చేపట్టారు.
కోవిడ్ వ్యాప్తికి ముందు నుంచే ఈ ప్రోటీన్ పై అధ్యయనం చేస్తున్నారు పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన హెన్రీ డేనియల్. రక్తపోటు (hypertension) చికిత్స కోసం ACE2 ప్రోటీన్ పై ఈ పరిశోధనలు చేపట్టారు. పేటెంట్ పొందిన ప్లాంట్ బేస్డ్ ప్రొడక్షన్ సిస్టమ్ ను ఉపయోగించి ACE2 ప్రోటీన్ ను ఆయన ల్యాబ్‌లో పెంచారు. ఈ క్రమంలో డేనియల్, ఆయన సహోద్యోగి హ్యూన్ కూ కలిసి దంతాలపై ఏర్పడే గారను వదిలించే బబుల్ గమ్‌ను తయారు చేయాలనుకున్నారు. ఇందులో భాగంగా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్‌తో నిండిన చూయింగ్ గమ్‌ను అభివృద్ధి చేయాలని భావించారు.
కొన్ని పరిశోధనల తరువాత ఈ సరికొత్త బబుల్ గమ్ ను వారు తయారు చేశారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ వైరస్ ను నిర్వీర్యం చేసే పద్ధతులపై డేనియల్, హ్యూన్ దృష్టిపెట్టారు. తాము రూపొందించిన మొక్కల ఆధారిత ACE2 ప్రోటీన్ ఉండే బబుల్ గమ్, నోటిలోని SARS-CoV-2ను తటస్తం చేయగలదని వారి పరిశోధనలో తేలింది. ఈ వివరాలను ఒక ప్రకటనలో తెలిపింది పెన్సిల్వేనియా యూనివర్సిటీ.
ఈ పరిశోధనలో డేనియల్, హ్యూన్ కూ, వైరాలజిస్ట్ రోనాల్డ్ కోల్ మన్ పాలుపంచుకున్నారు. ముందుగా వారు మొక్కలలో ACE2 ప్రోటీన్ ను పెంచారు. దాన్ని మరో కాంపౌండ్ తో కలిపారు. ఆ తరువాత వచ్చిన పదార్థాన్ని దాల్చినచెక్క ఫ్లేవర్ గల గమ్ టాబ్లెట్లలో చేర్చారు. ఈ బబుల్ గమ్ ను కోవిడ్-పాజిటివ్ రోగుల నుంచి సేకరించిన నాసల్ స్వాబ్స్ శాంపిల్స్‌తో కలిపి చూశారు. తద్వారా తాము అభివృద్ధి చేసిన ప్లాంట్ బేస్డ్ ACE2 ప్రోటీన్ SARS-CoV-2ను తటస్తం చేయగలదని వారు కనుగొన్నారు. బబుల్ గమ్‌ను నమిలిన కోవిడ్ రోగుల స్వాబ్‌లో వైరల్ లోడు తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona virus