Covid-19: మెదడుపై కరోనా ప్రభావం ఉంటుందా..? తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

మాయదారి రోగం కరోన తీసుకొస్తున్న సంక్షోభాలు అన్నీ ఇన్నీ కావు. ఈ వైరస్ ఒకసారి సోకిన తర్వాత దాని దుష్పరిణామాలు కొనసాగుతాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో వెలుగులోకి వస్తున్న విషయాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.


Updated: October 29, 2020, 1:11 PM IST
Covid-19: మెదడుపై కరోనా ప్రభావం ఉంటుందా..? తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా సోకిన వ్యక్తుల్లో కొత్త అనారోగ్యాలు బయటపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మహమ్మారి బారిన పడిన రోగుల మెదడులో కొత్త సమస్యలను పరిశోధకులు తాజాగా గుర్తించారు. కోవిడ్ -19 వ్యాప్తి, ప్రభావంపై చేసిన 80కి పైగా అధ్యయనాలను నిపుణులు విశ్లేషించారు. వారిలో మూడింట ఒక వంతు మందిలో, మెదడు ఫ్రంటల్ లోబ్‌లో అసాధారణ మార్పులు గుర్తించారు. కరోనా శరీరంలోని నాడులను కూడా ప్రభావితం చేస్తుందని దీని ద్వారా తెలుస్తోంది. ఈ అధ్యయనాన్ని యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఎపిలెప్సీ- సీజర్లో ప్రచురించారు. మెదడులోని విద్యుత్ కార్యకలాపాలను అంచనా వేయడానికి ఉపయోగించే ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ (EEG) స్కానింగ్ ద్వారా తాజా అంశాలను వైద్య నిపుణులు పరిశీలించారు.

ఎక్కువమందిలో సమస్యలు :

కరోనా సోకిన 600 మందికి పైగా రోగుల్లో తాజా లక్షణాలను కనుగొన్నామని అధ్యయన బృంద సభ్యుడు జుల్ఫీ హనీఫ్ చెబుతున్నారు. ఆయన అమెరికాలోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లో న్యూరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్. ‘ఇంతకు ముందు కొంతమందిలో దీన్ని గుర్తించినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. ఇది కేవలం యాదృచ్ఛికం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎక్కువ మంది రోగులను పరీక్షించడం ద్వారా మెదడుపై వైరస్ ప్రభావం ఎక్కువమందిలో ఉందని తెలుస్తోంది’ అని హనీఫ్ వివరిస్తున్నారు.

మెదడు విద్యుత్ వ్యవస్థలో లోపాలు :
సాధారణంగా స్పందించే గుణం తగ్గిపోయిన రోగులకు EEG పరీక్షను సిఫారసు చేస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారిలో స్పీచ్ ఇష్యూస్, అయోమయంగా ప్రవర్తించడం, మత్తు కలిగించే మెడిసిన్ తీసుకున్న తరువాత నిద్ర లేవడంలో సమస్యలు వంటి లక్షణాలు ఉండవచ్చు. తాజా అధ్యయనాల్లో పరిశోధకులు EEG ద్వారా రోగుల మెదడులో ఉండే సహజ విద్యుత్ వ్యవస్థ పనితీరులో లోపాలను గుర్తించారు. వారి మెదడులోని ఫ్రంటల్ లోబ్‌లో ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటున్నాయని కనుగొన్నారు. కోవిడ్ -19 సోకిన వారిలో కనిపించే ఇలాంటి మార్పులు కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా మెదడుకు నష్టం కలిగిస్తాయని వారు చెప్పారు.

వృద్ధుల్లోనే ఎక్కువ :
మెదడు కణాలను పునరుత్పత్తి (రీ జెనరేట్) చేసుకోలేదు. అందువల్ల దానికి ఏదైనా డ్యామేజీ జరిగితే, అది శాశ్వతంగా ఉంటుందని హనీఫ్ తెలిపారు. వైరస్ ఎక్కువగా ముక్కు ద్వారానే వ్యాపిస్తుంది కాబట్టి, ఆ ఎంట్రీ పాయింట్‌కు దగ్గరగా ఉన్న మెదడుపై దాని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోందని ఆయన చెప్పారు. "ఇలాంటి మెదడు సంబంధిత అనారోగ్యాలకు ప్రభావితమైన కోవిడ్ రోగుల సగటు వయస్సు 61. అందులో మూడింట రెండు వంతులు మగవాళ్లు, ఒక వంతు ఆడవాళ్లు ఉన్నారు ఉన్నారు. అంటే కోవిడ్-19 ప్రభావం వృద్ధుల మెదడుపై, అది కూడా మగవాళ్లలో ఎక్కువగా కనిపిస్తోంది" అని హనీఫ్ వివరించారు.తాజా పరిశోధనలో గుర్తించిన అంశాలను ధ్రువీకరించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వైరస్ నేరుగా మెదడులో అసాధారణమైన EEG రీడింగులకు కారణం కాకపోవచ్చని హనీఫ్ తెలిపారు. శరీరానికి ఆక్సిజన్ అందడంలో లోపాలు, కోవిడ్ -19కు సంబంధించిన గుండె సమస్యలు, ఇతర దుష్ప్రభావాల వల్ల కూడా రోగుల మెదడులో ఇలాంటి మార్పులు ఉండవచ్చని చెప్పారు.

ఎక్కువ మంది కరోనా రోగులపై EEG, MRI, CT స్కాన్లు వంటి పరీక్షలు చేయడం ద్వారా మెదడులోని ఫ్రంటల్ లోబ్‌పై మరిన్ని అధ్యయనాలు చేయాలని తమ పరిశోధన గుర్తుచేస్తోందని హనీఫ్ పేర్కొన్నారు. "చాలా మంది ప్రజలు తమకు వైరస్ సోకినా ఆరోగ్యం బాగుపడుతుందని, ఆరోగ్యం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుందని అనుకుంటారు. కానీ వారిలో దీర్ఘకాలిక సమస్యలు ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. మా పరిశోధన కూడా దీన్ని బలపరుస్తోంది. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది" అని ఆయన వివరిస్తున్నారు.
Published by: Srinivas Munigala
First published: October 29, 2020, 1:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading