The Truth About Wuhan : దాదాపు 3 ఏళ్ల క్రితం చైనా(China) నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న కరోనా అనే ఓ వైరస్(Corona virus) ప్రపంచానికి పెను ముప్పుగా మారిన విషయం తెలిసిందే. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది మరణించారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ వైరస్ బారిన పడినవే. ఇప్పటికీ పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్లు పలు దేశాలను వణికిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ మానవ నిర్మితమని,ఇది ల్యాబ్ నుంచి లీకయ్యిందని చైనాలో పనిచేసిన అమెరికా శాస్త్రవేత్త సంచలన విషయాలను బయటపెట్టడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైందని భావిస్తున్న చైనాలోని వివాదాస్పద "వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ" ల్యాబ్‌లో పనిచేసిన అమెరికా శాస్త్రవేత్త,ఎపిడెమియాలజిస్ట్ ఆండ్రూ హఫ్ తాజాగా రాసిన "ది ట్రూత్ అబౌట్ వూహాన్(The Truth About Wuhan)" అనే పుస్తకంలో సంచలన నిజాన్ని బయటపెట్టారు. చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని వుహాన్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ వైరాలజీ (WIV)నుంచే రెండేళ్ల కిందట కరోనా వైరస్ లీక్ అయ్యిందని, చైనా ల్యాబ్‌లో అధ్యయనం చేస్తున్న కరోనా వైరస్‌లకు అమెరికా ప్రభుత్వం నిధులు సమకూర్చడం వల్ల ఈ మహమ్మారి సంభవించిందని తెలిపారు. బ్రిటిష్ వార్తాపత్రిక ది సన్‌లో పరిశోధకుడు ఆండ్రూ హఫ్ ప్రకటనను ఉటంకిస్తూ న్యూయార్క్ పోస్ట్ దీనిని నివేదించింది.
వూహాన్ ల్యాబ్ లో పరిశోధనలకు తగినంత భద్రత లేకపోవడంతోనే ఈ వైరస్ లీక్ అయినట్లు ఆండ్రూ హఫ్ తన పుస్తకంలో తెలిపారు. ఈ పరిశోధనలు అత్యంత రిస్క్ తో కూడినవని,వీటిని సరైన భద్రతతోపాటు ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే నియంత్రించగలిగేలా ల్యాబ్ లో తగినంత కట్టుదిట్టమైన చర్యలు లేవన్నారు. దీంతో చివరికి వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో వైరస్ లీక్‌కు దారితీసింది అని ఆండ్రూ హఫ్ తన పుస్తకంలో వివరించారు. ఇది జన్యుపరంగా అభివృద్ది జరిగిందని, దీనిగురించి చైనాకు ముందు నుంచి తెలుసని తెలిపారు. అపాయకరమైన ఈ బయోటెక్నాలజీని చైనీయులకు బదిలీ చేయడానికి అమెరికా ప్రభుత్వమే కారణమని, ఈ సమయంలో వారికి బయోవెపన్ టెక్నాలజీని అందజేస్తున్నామని తాను కూడా భయపడ్డానని ఆండ్రూ హాఫ్ పుస్తకంలో వివరించినట్లు వార్త సంస్థలు తెలిపాయి.
Video : వ్యక్తిని ఇంటి నుంచి బలవంతంగా క్వారంటైన్ కి లాక్కెళ్లిన చైనా అధికారులు
అంతేకాకుండా,అమెరికా ప్రభుత్వ ప్రాథమిక ఏజెన్సీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్(NIH)..అంటువ్యాధులపై అధ్యయనం చేసే ఎకోహెల్త్ అలియన్స్ అనే సంస్థకు గబ్బిలాలతో వివిధ కరోనా వైరస్ లపై అధ్యయనం చేసేందుకు దశాబ్దాలకుపైగా నిధులు సమకూర్చినట్లు తెలిపారు. ఈ సంస్థ వూహాన్ ల్యాబ్ తో కలిసి ఈ కరోనా వైరస్ పై మరింత పరిశోధనలు చేసిందని,ఫలితంగానే ఈ వైరస్ లీక్ అయినట్లు చెప్పారు. కాగా, ఆండ్రూ హఫ్..2014 నుంచి 2016 వరకు ఎకోహెల్త్ అలియన్స్ సంస్థ మాజీ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఈ ఎకోహెల్త్ సంస్థ కరోనా వైరస్ ను సృష్టించే పరిశోధన పద్దతులను మరింతగా అభివృద్ధి చేయడంలో వూహాన్ ల్యాబ్ కు సాయం చేసినట్లు తెలిపారు. కాగా, కరోనా వ్యాప్తి వ్యూహాన్ ల్యాబే మూలకారణమంటూ గతంలోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఈ ఆరోపణలను చైనా ప్రభుత్వాధికారులతోపాటు వూహాన్ ల్యాబ్ సిబ్బంది కూడా కొట్టివేసిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Corona virus, Covid -19 pandemic, Wuhan