కరోనా వేళ వివిధ వర్గాలకు చెందిన అనేక మంది ప్రజలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారాలు దెబ్బతిని అనేక మంది నష్టపోయారు. ఉద్యోగాలు కోల్పోయిన అనేక మంది రోడ్డున పడ్డారు. లాక్ డౌన్ సమయంలో అనేక మంది దాతలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పేదలకు సాయం చేసి ఆదుకున్నారు. నిత్యవసరాలు అందించి మానవత్వం చాటుకున్నారు. అయితే సెక్స్ వర్కర్లు కరోనా నేపథ్యంలో అనేక ఇబ్బంది పడ్డారు. బయటికి కనిపించని చీకటి బతుకులు వారివి. దీంతో వారిని ఆదుకునే వారు కరువయ్యారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డు ఉన్న పేదలకు రేషన్, ఆర్థిక సాయం అందించి అండగా నిలిచాయి. కానీ.. సెక్స్ వర్కర్ల వివరాలు ప్రభుత్వాలు దగ్గర లేక పోవడం, ఎలాంటి ప్రభుత్వ పథకాల్లో వారి వివరాలు నమోదు కాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు.
ఈ నేపథ్యంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. కరోనా నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న సెక్స్ వర్కర్లను ఆదుకోవాలని కోరాయి. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం సెక్స్ వర్కర్లకు రేషన్ అందించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. నేషినల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(NACO) నుంచి సెక్స్ వర్కర్ల వివరాలను సేకరించాలని సూచించింది. నాలుగు వారల్లోగా ఈ అంశంపై పిటీషన్ దాఖలు చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. సహాయం అందించే క్రమంలో సెక్స్ వర్కర్ల వివరాలను బహిర్గతం చేయవద్దని సూచించింది.
ఇదిలా ఉంటే.. పండగ సమయంలో కరోనాతో జాగ్రత్తగా ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవలే హెచ్చరించిన విషయం తెలిసిందే. మహమ్మారి విషయంలో ఏమరపాటు వద్దని ప్రధాని సూచించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఈ సూచనలను పాటించనట్టు కనిపిస్తోంది. పండగ వేళ కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించడమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. కేరళ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో కేసుల సంఖ్య పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
పండగ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. మాస్క్ ధరించడం, చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. గడిచిన 24 గంటల్లో 58 శాతం కరోనా మరణాలు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, చత్తీస్‌గఢ్, కర్ణాటకలోనే నమోదయ్యాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో 49.4 శాతం కరోనా కేసులు కేరళ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటకలోనే వెలుగుచూశాయని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Supreme Court