భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ చివరి దశకు చేరుకుంది. దేశంలో వెలుగు చూసిన డెల్టా వేరియంట్.. రెండో దశ కోవిడ్ ఉద్ధృతికి కారణమైందని అధ్యయనాలు తెలిపాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న డెల్టా ప్లస్, ల్యామ్డా వంటి మరికొన్ని ఉత్పరివర్తనాలు కరోనా ముప్పుపై ఆందోళనలు పెంచుతున్నాయి. రెండో దశలో యువతపై ఎక్కువగా ప్రభావం చూపిన మహమ్మారి, తదుపరి దశల్లో చిన్నారులపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆగస్టు ప్రారంభం నుంచి భారత్‌లో కోవిడ్ థర్డ్ వేవ్ మొదలయ్యే అవకాశం ఉందని ఎస్బీఐ రిసెర్చ్ రిపోర్టు వెల్లడించింది. ‘కోవిడ్-19: ద రేస్ టు ఫినిషింగ్ లైన్’ పేరుతో ఎస్బీఐ దీనికి సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించింది.
పాలకులు, ప్రజలు ఈ నివేదికపై దృష్టి పెట్టాలని ఎస్బీఐ రిసెర్చ్ సూచించింది. 2021 ఆగస్టు నుంచి కోవిడ్ మూడో దశకు అవకాశాలు ఉన్నాయని రిపోర్టు పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో కరోనా ఉద్ధృతి తీవ్ర స్థాయికి చేరుకుంటుందని వెల్లడించింది. ఈ ఏడాది మే 7న భారత్‌లో సెకండ్ వేవ్ తీవ్ర స్థాయికి చేరుకుందని రిసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. "ప్రస్తుత డేటా ప్రకారం చూస్తే.. జులై రెండో వారంలో దేశంలో 10,000 వరకు కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆగస్టు ద్వితీయార్ధంలో కేసుల పెరుగుదల ప్రారంభమవుతుంది. తరువాతి నెలలో కరోనా ఉద్ధృతి తీవ్ర స్థాయికి పెరుగుతుంది" అని నివేదిక తెలిపింది.
నివేదికలోని ముఖ్యాంశాలు
* సెకండ్ వేవ్‌లో మహమ్మారి తీవ్ర స్థాయికి చేరుకున్నప్పుడు నమోదైన కోవిడ్ కేసులతో పోలిస్తే, థర్డ్ వేవ్‌లో 1.7 రెట్లు ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని గ్లోబల్ డేటా చెబుతోంది.
* గత నివేదికల ఆధారంగా చూస్తే.. ఆగస్టు ద్వితీయార్ధంలో కేసుల పెరుగుదల కనిపిస్తుంది. తరువాత నెలలో కోవిడ్ ఉద్ధృతి తీవ్ర స్థాయికి చేరుకుంటుంది.
* భారత్‌లో సగటున రోజుకు 40 లక్షల కోవిడ్ వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్నారు.
* దేశ జనాభాలో 4.6 శాతం మంది వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. మరో 20.8 శాతం జనాభాకు ఒక డోసు వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే జనాభా శాతంతో పోలిస్తే.. అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, స్పెయిన్, ఫ్రాన్స్‌తో సహా ఇతర దేశాల కంటే ఇది తక్కువగా ఉంది. మొత్తం డోసుల సంఖ్య ప్రకారం ఇతర దేశాల కంటే భారత్ ఎక్కువ వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందించింది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.