కోతుల కడుపు నింపుతున్న పోలీస్.. మూగజీవాలకు నిత్యాన్నదానం

కోతులకు ఆహారం అందిస్తున్న ఏసీపీ వెంకటేష్

కరోనా మహమ్మారి మాయమై పోయి మళ్లీ యథావిధిగా భక్తుల తాలూకూ ప్రసాదాలు, పండ్లూ వాటికి నిత్యం అందేదాకా తానే వాటికి సాయం చేయాలని నిశ్చయించుకున్నారు ఏసీపీ.

 • Share this:
  (జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా కరెస్పాండెంట్)
  పాపం అవన్నీ మూగజీవాలు. దేవుని పుణ్యమా అని నిత్యం భక్తులిచ్చే అరటిపళ్లు, జాంపళ్లు, కొబ్బరిచిప్పలు, పులిహోర ఇంకా రకరకాల ఫలాలు, ప్రసాదాలతో కడుపునింపుకుంటూండేవి. తరతరాలుగా అడవిలో ఉన్న ఆ దేవుణ్నే నమ్ముకుని తిండికి లోటు లేకుండా హాయిగా బతుకులీడుస్తున్న ఆ జంతువులకు ఒక్కసారిగా కరోనా రూపంలో కష్టమొచ్చి పడింది. పుట్టి బుద్ధెరిగినాక ఎల్లప్పుడు దేనికీ లోటు లేని వాటికి పూట గడవడమే కష్టమైపోయింది. గుడి మూశారు. ఒక్కరంటే ఒక్క భక్తుడు గుడి వైపు రావడం లేదు. ఎలా.. బతకడం ఎలా..? చేసేదేముంది చుట్టూ ఉన్న అడవిలో దొరికిన కాయలు.. పిందెలు.. ఆకులు.. అలములు తిన్నాయి.

  చివరకు చెట్లకుండే బెరడు కూడా పీక్కుని తిన్నా కడుపు నిండని పరిస్థితి. తీరా నడి ఎండాకాలం వచ్చిపడింది. అదీ కష్టమైపోయింది. ఇన్నాళ్లూ తమకు ఆకలి తీర్చిన చెట్లు ఎండిపోయాయి. నిలువ నీడ కూడా లేకుండా పోయింది. ఇక ఆకలి.. దప్పుల సంగతి దేవుడెరుగు. డొక్కలెండిపోయాయి. మర్కటాలు బక్కచిక్కిపోయాయి. అప్పటిదాకా జీవితంలో ఎన్నడూ అలాంటి కరవును చూడని ఆ మూగజీవాలు ఈ ఉపద్రవానికి తల్లిడిల్లిపోయాయి. ఎటు పోవాలో తెలీక అల్లాడిపోయాయి. ఇలా ఒకటి.. రెండూ కాదు. వందల సంఖ్యలో ఉన్న ఆ జంతువులకు ఆశాదీపంలా ఓ మనిషి తారసపడ్డాడు. వాటి దాహం.. ఆకలి తీర్చాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గుడులు తెరిశాక కూడా దేవాలయానికి పెద్దగా భక్తులు రావడం లేదు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న ఆ జంతు ప్రేమికుడు ఏకంగా వాటి కోసం నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు.

  ఇది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని ప్రసిద్ధిగాంచిన నీలాద్రీశ్వరస్వామి వారి దేవాలయ పరసర ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఉంటున్న వందలాది కోతుల ముచ్చట. ఇక వాటి ఆకలి తీర్చి ఆదుకున్నది సత్తుపల్లి ఏసీపీ వెంకటేష్‌. చేసేది కఠినమైన పోలీసు ఉద్యోగమే అయినప్పటికీ.. ఆ జంతువుల బాధను మనసుతో ఆలోచించి వాటి ఆకలి తీర్చారు. ఈ కరోనా మహమ్మారి మాయమై పోయి మళ్లీ యథావిధిగా భక్తుల తాలూకూ ప్రసాదాలు, పండ్లూ వాటికి నిత్యం అందేదాకా తానే వాటికి సాయం చేయాలని నిశ్చయించుకున్నారు ఏసీపీ. నోరులేని జీవుల ఆకలి తీర్చడం కన్నా దైవ సేవ ఉంటుందన్నది ఈ నిత్యాన్నదాత వెంకటేష్‌ మనసులో మాట.

  విధి నిర్వహణలో సైతం ఆయన ఆ రహదారిలో ఎప్పుడు వెళ్లినా, లేదా కాస్త విరామం దొరికినా తన వాహనంలో ఆ వానరాలకు అసవరమైన పండ్లు, ఇంకా రకరకాల తినుబండారాలు తీసుకుని వెళ్లి తన స్వహస్తాలతో వాటికి తినిపిస్తుంటారు. సాటి మనిషికి సాయం చేయడానికి సంకోచించే ఈ రోజుల్లో వందలాది కోతుల ఆకలిని తీరుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారీ ఏసీపీ వెంకటేష్‌.
  Published by:Shiva Kumar Addula
  First published: