ఏడు నెలల తర్వాత రెండ్రోజుల క్రితమే తెరుచుకున్న శబరిమలలో కరోనా కలకలం రేపింది. దర్శనానికి వచ్చిన ఒక భక్తుడికి కరోనా వచ్చింది. దీంతో అక్కడికి వచ్చిన భక్తులతో పాటు దేవాలయ పూజారులు, ఆలయ అధికారుల్లో కలకలం మొదలైంది. కరోనా వచ్చిన వ్యక్తిని తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
కోవిడ్-19 మార్గదర్శకాల ప్రకారం.. శబరిమల యాత్రకు వచ్చే వారు ఆ నిబంధనల్ని కచ్చితంగా పాటించాలి. ఇందులో భాగంగా యాత్రకు వచ్చేవారు 48 గంటల ముందు తాము చేసుకున్న యాంటిజెన్ పరీక్షలకు సంబంధించిన పత్రాలను ఆలయ అధికారులకు చూపించాలి. ఇందులో కరోనా అని తేలితే వారిని ఆలయంలోకి అనుమతించరు. కాగా, తమిళనాడుకు చెందిన ఒక భక్తుడు.. దగ్గర్లోని ఒక పరీక్ష కేంద్రం వద్ద కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. అందులో అతడికి కోవిడ్ ఉందని తేలింది.
దీంతో అతడిని అక్కడ్నుంచి కోవిడ్ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ కేంద్రానికి మార్చారు. కరోనా లేదని గడిచిన 48 గంటల్లో ధృవీకరణ పత్రం తీసుకురానివారికి నీలాకల్ వద్ద యాంటిజెన్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం విదితమే.
అయితే తమిళనాడు వ్యక్తికి కరోనా అని తెలియగానే శబరిమలకు వచ్చిన మిగతా భక్తులు ఆందోళనకు గురయ్యారు. కానీ కరోనా వచ్చిన వ్యక్తి ఒక్కడే వచ్చాడనీ, ఎవరితోనూ అతడు కాంటాక్ట్ కాలేదని అధికారులు చెప్పడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గినా.. ఉధృతి మాత్రం అదే విధంగా ఉంది. దేశంలో సోమవారంనాటికి నమోదైన కేసులు 75 లక్షలుగా ఉన్నాయి. కాగా, శబరిమలలో జారీచేసిన కోవిడ్ నిబంధనల ప్రకారం.. ప్రతిరోజు 250 మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నారు. 10-60 వయసు ఉన్న భక్తులను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. అయితే వారు కూడా పంబ నదిలో స్నానాలు చేయడం, అభిషేకాలు చేయడం నిషేధం. అంతేగాక సమూహాలుగా కాకుండా.. భౌతిక దూరాన్ని పాటిస్తూ శబరిమల యాత్ర చేసుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలు సూచించిన విషయం తెలిసిందే.
కాగా, శబరిమల యాత్రికులు దర్శనం కోసం టైమ్ స్లాట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వర్చ్యువల్ క్యూ పోర్టల్ ద్వారా దర్శనం కోసం భక్తులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. దీనికోసం https://sabarimalaonline.org వెబ్ సైట్ లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. మామూలు రోజుల్లో వెయ్యి మందికి.. వారాంతాల్లో రెండువేల మందికి రోజుకు అయ్యప్ప దర్శనం కల్పిస్తారు. ఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తారనీ, అందుకు అనుగుణంగా భక్తులు తమ దర్శనానికి ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.