Post Covid Complications: విపరీతంగా ఊడుతున్న జుట్టు.. కరోనా బాధితులకు మరో కొత్త సమస్య

ప్రతీకాత్మక చిత్రం

అకస్మాత్తుగా జుట్టు రాలిపోయే సమస్యను టెలోజెన్ ఎఫ్లూవియం అంటారు. ప్రధానంగా ఒత్తిడి, పోషకాల లోపం, అంటు వ్యాధుల వల్ల ఎదురయ్యే ప్రతిచర్యల వల్ల ఈ రుగ్మత ఎదురవుతుంది.

  • Share this:
కరోనా మహమ్మారి కొత్త వ్యాధులకు సైతం కారణమవుతోంది. వైరస్ బారిన పడి కోలుకున్న వారిని వివిధ రకాల ఫంగస్‌లు భయపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా కోవిడ్-19 నుంచి కోలుకున్న వారిని మరో కొత్త రకం సమస్య వేధిస్తోందని చెబుతున్నారు వైద్య నిపుణులు. కోవిడ్ అనంతర సమస్యల్లో జుట్టు రాలిపోయే సమస్య తీవ్రమవుతున్నట్లు గురువారం వెల్లడించారు ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్ వైద్యులు.

అకస్మాత్తుగా జుట్టు రాలిపోయే సమస్యను టెలోజెన్ ఎఫ్లూవియం అంటారు. ప్రధానంగా ఒత్తిడి, పోషకాల లోపం, అంటు వ్యాధుల వల్ల ఎదురయ్యే ప్రతిచర్యల వల్ల ఈ రుగ్మత ఎదురవుతుంది. సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు 100 వెంట్రుకలు కోల్పోవచ్చు. కానీ టెలోజెన్ ఎఫ్లూవియం కారణంగా ఈ సంఖ్య 300-400 వెంట్రుకల వరకు పెరుగుతుందని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి కాస్మెటిక్స్, ప్లాస్టిక్ సర్జరీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ షాహిన్ నూరియెజ్డాన్ తెలిపారు.

జుట్టు రాలే సమస్యకు సంబంధించిన కేసుల సంఖ్య ఇటీవల రెండు రెట్లు పెరిగినట్లు చెప్పారు షాహిన్. ‘దీనికి కారణం పోస్ట్ కోవిడ్ ఇన్‌ఫ్లమేషన్ అని చెప్పుకోవచ్చు. వైరస్ నుంచి కోలుకున్న తరువాత పోషకాహారం తీసుకోకపోవడం, శారీరక బరువులో ఆకస్మిక మార్పులు, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, విటమిన్ డి, బి 12 స్థాయిలు తగ్గడం.. వంటివి కోవిడ్ అనంతరం బాధితుల్లో పెద్ద మొత్తంలో జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు’ అని ఆయన వివరించారు. కోవిడ్ తర్వాత నెల నుంచి నెలర్నర రోజుల్లో ఈ సమస్య ఎదురవడం సహజమేనని వైద్యులు తెలిపారు. సరైన చికిత్స పద్ధతులతో ఈ తాత్కాలిక సమస్యను రెండు మూడు నెలల్లో తగ్గించవచ్చని షాహిన్ వివరించారు.

టెలోజెన్ ఎఫ్లూవియం బారిన పడినవారికి సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. అయితే సమస్య తీవ్రమైన వారు మాత్రం వైద్యుల పర్యవేక్షణలో విటమిన్, ఇతర పోషకాల సప్లిమెంట్లను తీసుకోవాల్సి ఉంటుంది. బయోటిన్, ఎమినో యాసిడ్లు, ఐరన్, ఇతర ఖనిజాల సప్లిమెంట్లను కొందరు బాధితులు వాడాల్సి ఉంటుంది. అయితే సమస్య మరీ తీవ్రంగా మారకుండా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత పోషక వనరులు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సిఫారసు చేస్తున్నారు. బాధితులు పూర్తిగా కోలుకున్న తరువాత తప్పనిసరిగా 5-6 వారాల పాటు పోషకాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్, కాస్మెటాలజీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ నిపుణులు కుల్దీప్ సింగ్. ఆ తరువాత కూడా జుట్టు రాలడం ఆగకపోతే.. వైద్యులను సంప్రదించాలని సూచించారు.
Published by:Shiva Kumar Addula
First published: