ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా విజృంభించిన డెల్టా కోవిడ్ వేరియంట్, ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపింది. ఈ వినాశనం మరువకముందే ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ నెమ్మదిగా అన్ని దేశాలకు పాకుతోంది. ఇది డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వెలుగుచూసిన దక్షిణాఫ్రికాలోని చాలామంది పిల్లలు ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఈ పిల్లలలో తేలికపాటి నుంచి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్య నిపుణులు తెలిపారు. దక్షిణాఫ్రికా, UK నుంచి సేకరించిన డేటా ప్రకారం, ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు పిల్లలను లక్ష్యంగా చేసుకుంటోంది. రానున్న కాలంలో ఈ వేరియంట్ పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
కరోనావైరస్ మనుపటి వేరియంట్ల బారిన పడిన పిల్లల్లో చాలా తేలికపాటి లక్షణాలు కనిపించాయి. కొందరిలో ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం వారిలో తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే ఒమిక్రాన్ ఎంత తీవ్రంగా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని పరిశోధకులు చెబుతున్నారు. లక్షణాలు గుర్తించి సకాలంలో చికిత్స చేస్తే ప్రమాదం తప్పుతుందని సూచిస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో ఎక్కువ కేసులు
ఒమిక్రాన్ కరోనావైరస్ వేరియంట్ కారణంగా దక్షిణాఫ్రికాలో ఫోర్త్ వేవ్ వచ్చింది. దీనికి చాలామంది పిల్లలు ప్రభావితమవుతున్నారు. కొంతమంది బాధిత చిన్నారులు ఆసుపత్రిలో చేరాల్సి వస్తోంది. అయితే ఇన్ఫెక్షన్లు స్వల్పంగా ఉన్నందువల్ల పెద్దగా భయాందోళనలకు గురికాకూడదని, ఇప్పటికైతే దీని తీవ్రత పెద్దగా లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గౌటెంగ్ ప్రావిన్స్‌లోని ఆసుపత్రుల్లో ఉన్న 1,511 మంది కోవిడ్-పాజిటివ్ రోగుల్లో.. 113 మంది 9 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారేనని అక్కడి పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ న్ట్సాకిసి మలులేకే రాయిటర్స్‌తో చెప్పారు. ఇది మునుపటి కోవిడ్ వేవ్స్ కంటే ఎక్కువ.
దక్షిణాఫ్రికాలోని కోవిడ్ పాజిటివ్ రోగుల నుంచి చాలా తక్కువ శాతం శాంపిల్స్‌ను మాత్రమే జెనోమిక్ సీక్వెన్సింగ్ కోసం పంపిస్తున్నారు. దీంతో ఆసుపత్రిలో చేరిన పిల్లలు ఏ వేరియంట్ బారిన పడ్డారనే విషయంపై అధికారులకు స్పష్టమైన సమాచారం లేదు. సౌత్ ఆఫ్రికా మెడికల్ అసోసియేషన్ చైర్ పర్సన్ అయిన డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ ప్రధాన లక్షణాలు అందరిలో ఒకేలా లేవని చెప్పారు. యువకులతో పాటు పిల్లల్లో అలసట, ఒంటి నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. డెల్టా మాదిరిగా వాసన, రుచి కోల్పోయినట్లు బాధితులు నివేదించలేదని ఆమె తెలిపారు.
అయితే హాస్పిటల్‌కు వస్తున్న పిల్లల్లో మోస్తరు నుంచి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నాయని దక్షిణాఫ్రికా వైద్య విభాగం అధికారులు విశ్లేషిస్తున్నారు. వారికి ఆక్సిజన్, సపోర్టివ్ థెరపీ, ఎక్కువ కాలం ఆసుపత్రిలో చికిత్స అవసరమవుతున్నట్లు తెలిపారు. మునుపటి కరోనా వేవ్స్ కంటే ప్రస్తుతం చిన్నారులు ఎక్కువగా అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు క్రిస్ హానీ బార్గవనాథ్ అకడమిక్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ రుడో మాథివా. ఒమిక్రాన్ వేరియంట్‌ను గత నెలలో దక్షిణాఫ్రికాలో మొదటిసారి కనుగొన్నారు. ఇది ఎలాంటి అనారోగ్యాలకు దారితీస్తుంది, దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనే అంశాలపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. ప్రస్తుతానికి ఈ వేరియంట్ 30 కంటే ఎక్కువ దేశాల్లో కనిపించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Omicron