Corona: రీఇన్‌ఫెక్షన్ కేసుల్లో వైరస్ మ్యుటేషన్లు.. అసలు వాక్సిన్లు పనిచేస్తాయా?

news18-telugu
Updated: September 19, 2020, 11:12 AM IST
Corona: రీఇన్‌ఫెక్షన్ కేసుల్లో వైరస్ మ్యుటేషన్లు.. అసలు వాక్సిన్లు పనిచేస్తాయా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఒకసారి కరోనా వచ్చి తగ్గితే.. మళ్లీ వైరస్ సోకదని మొన్నటి వరకు అందరూ అనుకున్నారు. కాని రెండోసారి కూడా కరోనా బారినపడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచంలో మొట్ట మొదటి రీఇన్‌ఫెక్షన్ కేసు హాంగ్ కాంగ్‌లో నమోదయింది. ఈ క్రమంలో భారత్‌లోనూ పరీక్షలు చేయగా గ్రేటర్ నోయిడా, ముంబైలో రీఇన్‌ఫెక్షన్ కేసులు బయటపడ్డాయి. వైరస్ జన్యు క్రమాన్ని వివరించిన ఓ ప్రీ-ప్రింట్ స్టడీలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందిలో రీఇన్‌ఫెక్షన్‌ను గుర్తించారు. ఐతే వైరస్ మళ్లీ యాక్టివేట్ అయిందేమోనని మొదట భావించారు. కానీ లోతుగా విశ్లేషిస్తే అసలు విషయం బయటపడింది. మొదటి సారి సేకరించిన RNA శాంపిల్స్‌తో పోల్చితే రెండోసారి సేకరించిన దానిలో జన్యుపరమైన తేడాలున్నాయి. తద్వారా కరోనావైరస్‌లో మ్యుటేషన్లు (ఉత్పరివర్తం) వచ్చినట్లు నిర్ధారించారు.


గ్రేటర్ నోయిడాలోని గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (GIIMS)లో పనిచేసే ఇద్దరు సిబ్బంది, ముంబై ఆస్పత్రుల్లో పనిచేసే నలుగురు సిబ్బందికి రెండోసారి కరోనా నిర్ధారణ అయింది. వారి ఆర్ఎన్ఏ శాంపిల్స్‌పై ఢిల్లీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనామిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (IGIB) పరిశోధన చేసింది. మొదటి సారి వైరస్ సోకినప్పుడు సేకరించిన ఆర్ఎన్ఏ, రెండోసారి వైరస్ సోకినప్పుడు సేకరించిన ఆర్‌ఎన్ఏలను ల్యాబ్‌లో పరీక్షించారు. ఈ క్రమంలో GIIMS హెల్త్ వర్కర్‌కు చెందిన రెండో ఆర్‌ఎన్ఏలో జన్యుపరమైన మార్పులను శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు వారి శరీరంలో తయారైన యాంటీ బాండీలు కూడా నాశనమయ్యాయని జీనమ్ సీక్వెన్సింగ్ (జన్యు అనుక్రమణ) ప్రాథమిక ఫలితాల్లో తేలింది. మొత్తం ఏడు జతల ఆర్‌ఎన్ఏల్లో ఈ తేడాలు గుర్తించామని IGIB శాస్త్రవేత్తలు తెలిపారు.

రీ ఇన్‌ఫెక్షన్ అంటే..?
ఎలాంటి లక్షణాలు లేని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు RT-PCR పరీక్షలో నిర్ధారణ అయింది. ట్రీట్‌మెంట్ అనంతరం అతడు కోలుకున్నాడు. మళ్లీ పరీక్ష చేస్తే నెగెటివ్ వచ్చింది. ఆ తర్వాత అతడు బాగానే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత తిరిగి RT-PCR పరీక్ష చేస్తే మళ్లీ పాజిటివ్ వచ్చింది. ఇలా రెండోసారి కరోనా పాజిటివ్ రావడాన్నే రీ ఇన్‌ఫెక్షన్ అంటారు. రీఇన్‌ఫెక్షన్ వచ్చి ముంబై వైద్య సిబ్బందికి మొదట మేలో పాజిటివ్ నిర్ధారణ అయింది. ఐతే వారిలో కరోనా లక్షణాలు అప్పుడూ కనిపించలేదు. ఇప్పుడూ కనిపించలేదు. రెండోసారి కోవిడ్ సోకిన తర్వాత మాత్రం వారిలో వైరల్ లోడ్ ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వైరస్‌లో మ్యుటేషన్లు రావడం వల్లే లోడ్ ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు.

మ్యుటేషన్ అంటే వైరస్ జన్యు నిర్మాణంలో మార్పులు చోటుచేసుకోవడం. మరి ఈ కొత్త మ్యుటేషన్లు వైరస్ వ్యాప్తి చెందే విధానం, దాన్ని ఎదుర్కొనేందుకు తయారుచేస్తున్న వాక్సీన్ల పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. వైరస్‌లో మ్యుటేషన్లు రావడం చాలా సహజమైన విషయమే. కానీ ఈ మ్యుటేషన్లలో ఏవి..కోవిడ్ వ్యాధిని మరింత ప్రమాదకారిగా మార్చగలవన్నది తెలుసుకోవడం కష్టమవుతుంది. ఉదాహరణకు శాస్త్రవేత్తలు ఓ వాక్సిన్‌ను తయారు చేస్తున్నారు. కానీ అంతలోనే వైరస్ మ్యుటేషన్ చెంది రూపాంతరం చెందితే.. ఆ కొత్త మ్యుటేషన్‌ను ఇప్పటికే తయారుచేసిన వాక్సిన్ ఎదుర్కొంటుందా? అన్నది ప్రశ్నార్థకమైంది. అసలు ఇప్పుడు తయారవుతున్న వాక్సీన్‌లు కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు పనిచేస్తాయా? లేదా? అన్న చర్చ జరుగుతోంది.
Published by: Shiva Kumar Addula
First published: September 19, 2020, 11:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading