భారత్‌లో కరోనా వ్యాక్సిన్ వచ్చిన విషయం తెలిసిందే. అత్యవసర సమయంలో కొవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల వినియోగానికి షరతులతో డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ఐతే కొవాగ్జిన్‌కు అనుమతులు ఇవ్వడంపై పలు రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. పూర్తిస్థాయిలో ప్రయోగాలు పూర్తికాకుండా ఎలా ఆమోదిస్తారని.. ఇది తొందరపాటు చర్య అని ప్రభుత్వాన్ని విమర్శించాయి. ఈ నేపథ్యంలో విపక్షాల ఆరోపణలు, వ్యాక్సిన్‌పై వస్తున్న పుకార్లపై భారత్ బయోటెక్ కంపెనీ సీఎండీ రమేష్ ఎల్లా స్పందించారు. భారత కంపెనీలపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగా బురద జల్లుతున్నారని.. ఇది కరెక్టు కాదని అన్నారు. శాస్త్రవేత్తల కృషిపై అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. మాకు ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదని స్పష్టం చేశారు రమేష్ ఎల్ల.
''శాస్త్రవేత్తలు, వాలంటీర్లకు ఈ విజయం అంకితం భారత్ కూడా సమర్థవంతమైన వ్యాక్సిన్లను అభివృద్ధి చేయగలదని మేం నిరూపించాం.
ప్రపంచ ప్రఖ్యాత జర్నల్స్‌లో భారత్ బయోటెక్‌పై వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వ్యాక్సీన్‌పై రాజకీయాలు చేస్తున్నారు. మా కుటుంబానికి రాజకీయాలతో సంబంధం లేదు. మా వాక్సిన్ను నీళ్లతో పోల్చుతారా? ఇది బాధాకరం. వ్యాక్సిన్ కోసం మేం ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. యూకేతో పాటు 12 దేశాల్లో కూడా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాం. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లో కూడా క్లినకల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. భారత్ బయోటెక్ దేశానికి సంబంధించినదే కాదు మాది గ్లోబల్ కంపెనీ. వ్యాక్సిన్ల విషయంలో మాకు గ్లోబల్ లీడర్షిప్ ఉంది. వ్యాక్సిన్ల తయారీలో సుదీర్ఘ అనుభవం ఉంది. అనేక దేశాల్లో భారత్ బయోటెక్ భాగస్వాములున్నారు. 123 దేశాలకు సేవలు అందిస్తున్నాం. అనేక వ్యాధులకు మేం వ్యాక్సిన్లు తయారు చేశాం.'' అని రమేష్ ఎల్ల పేర్కొన్నారు.
'' గతంలో చాలా తక్కువ మందిపై ప్రయోగాలు చేసిన కంపెనీలకు కూడా అనుమతులు వచ్చాయి. ఎబోలాకు మెర్క్స్ కంపెనీ చేసిన వ్యాక్సీన్‌కు ఎలాంటి ప్రయోగాలు చేయకుండానే WHO అనుమతి ఇచ్చింది. కానీ చాలా మందిపై ప్రయోగాలు చేశాం. కొవాగ్జిన్ సురక్షితమైన ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్. మా ప్రయోగ పద్దతులను నేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఆమోదించింది. మా డేటా పారదర్శకంగా లేదని అంటున్నారు. కానీ ఇది కరెక్టు కాదు. ఇంటర్నెట్లో ఎన్నో ఆర్టికల్స్‌ను మేం పబ్లిష్ చేశాం. అనుమానం ఉన్న వారు ఓపికతో వాటిని చదవాలి. భారత్ బయోటెక్ గురించి అంతర్జాతీయ జర్నల్స్‌పై 70కిపైగా ఆర్టికల్స్ ప్రచురితమయ్యాయి. మా సంస్థ విదేశీ కంపెనీలతో సమానంగా వ్యాసాలు కలిగి ఉంది. యూకే స్ట్రెయిన్‌పై కూడా కోవాగ్జిన్ చక్కగా పనిచేస్తుంది. ఇండియన్ కంపెనీలను టార్గెట్ చేయడం సర్వసాధారణంగా మారింది.'' అని రమేష్ ఎల్ల అన్నారు.
ప్రపంచంలో BSL-3 ప్రొడక్షన్ ఫెసిలిటీ ఉన్న ఏకమైన ఔషధ సంస్ధ భారత బయోటెక్ అని సగర్వంగా చెబుతున్నట్లు రమేష్ ఎల్ల తెలిపారు. అమెరికాలో కూడా అలాంటి అత్యాధునిక సదుపాయాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడ హెల్త్ ఎమర్జెన్సీ తలెత్తినా.. భారత్ బయోటెక్ సహాయం చేయగలదని చెప్పారు. కాగా, కొవాగ్జిన్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ.. ఎన్ఐవీ, ఐసీఎంఆర్ సహకారంతో అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. మన దేశంలో అత్యవసర వినియోగానికి కొవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.