Health Minister cleaning Toilet | రాజకీయ నాయకులు రోడ్లు ఊడవడం, ఇస్త్రీలు చేయడం, రోడ్డుపక్కన మురికికాలువలు క్లీన్ చేయడం ఇలాంటి సన్నివేశాలు సహజంగా ఎన్నికల సమయంలోనే కనిపిస్తూ ఉంటాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ నేతలు పడే పాట్లు పడుతూ ఉంటారు. అయితే, ఓ ఆరోగ్య మంత్రి కరోనా పేషెంట్లు ఉంటున్న ఆస్పత్రిలో టాయిలెట్ క్లీన్ చేశారు. ఆయన ఎవరో కాదు. పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు. పుదుచ్చేరి ఇందిరా గాంధీ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో మంత్రి కృష్ణారావు పర్యటించారు. బాధితులను పరామర్శించిన ఆయన.. వసతులు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. ఆస్పత్రిలో మరుగు దొడ్లు శుభ్రంగా లేవంటూ రోగులు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే మంత్రి కృష్ణారావు మరుగుదొడ్లను పరిశీలించారు. అక్కడ క్లీన్ గా లేకపోవడాన్ని చూశారు. వెంటనే మంత్రి కృష్ణారావు స్వయంగా చీపురు పట్టారు. టాయిలెట్ బ్రష్‌తో మరుగుదొడ్లను శుభ్రం చేశారు. ఇకనైనా పారిశుద్ధ్య కార్మికుల సాయంతో పరిసరాలు క్లీన్ చేయించాలని యాజమాన్యాన్ని మందలించారు. మరుగుదొడ్లు ఉపయోగించాక నీళ్లతో శుభ్రం చేసేయాలని.. ఎవరో వచ్చి క్లీన్ చేస్తారని వేచి చూడొద్దని కరోనా బాధితులకు కూడా మంత్రి సూచనలు చేశారు.
కరోనా వేళ పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, నర్సులు కలిపి మొత్తం 458 మంది ఆరోగ్య కార్యకర్తలను కాంట్రాక్టు పద్ధతిలో నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు (ఆగస్టు 30) 80 మంది నర్సులు ఉద్యోగంలో చేరనున్నారని పుదుచ్చేరి ఆరోగ్య మంత్రి మల్లాడి కృష్ణా రావు అన్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:August 30, 2020, 14:27 IST