తీరిక లేని జీవనశైలి, పని ఒత్తిడి వంటివి శారీరక, మానసిక సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా అందరిలో ఒత్తిడి మరింత పెరిగింది. ప్రస్తుతం చాలా మంది ఇప్పుడు వర్క్ ఫ్రం హోం కారణంగా ఇంటి నుంచి పని చేస్తున్నప్పటికీ, ఒత్తిడి, ఆందోళన వంటివి ఏమాత్రం తగ్గలేదని మానసిక ఆరోగ్యంపై చేస్తున్న సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి సమస్యలకు యోగా, ధ్యానంతో మంచి ఫలితాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనవి..
1. ఒత్తిడి నుంచి ఉపశమనంకరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా ఇబ్బంది పడ్డారు. చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. జీతాల కోతలతో మరికొందరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇవన్నీ ఒత్తిడి, ఆందోళనను పెంచాయి. ఇలాంటి సమయాల్లో మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటి బారిన పడకుండా ఉండాలంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. రోజులో ఎంతో కొంత సమయం మీకోసం కేటాయించుకోండి. ఏకాగ్రతతో ఎంతో కొంత సమయం యోగా, ధ్యానం చేయండి. మీకు నచ్చిన ప్రదేశంలో ప్రశాంతంగా 10 నిమిషాలు యోగా చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది. నెగెటివ్ ఎనర్జీని బయటకు పంపుతున్నామనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ధ్యానం చేయండి. ఇవి ఒత్తిడి, ఆందోళనను దూరం చేయడంతో పాటు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి.

ప్రతీకాత్మక చిత్రం
2. రక్తపోటును అదుపులో ఉంచడం
ఒత్తిడి, ఆందోళనల కారణంగా అధిక రక్తపోటు సమస్య వస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర అనారోగ్యాలకు దారి తీసే అవకాశం ఉంది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకపోతే గుండెపోటు, హార్ట్ స్ట్రోక్‌లకు దారితీస్తుంది. యోగా, ధ్యానంతో రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకు శ్వాసమీద ధ్యాస పెట్టి చేసే శ్వాస వ్యాయామాలు మంచి ఫలితాలను ఇస్తాయి. తద్వారా నరాలపై ఒత్తిడి తగ్గుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు శవాసనం, సేతు బంధ సర్వాంగాసనం(సపోర్టెడ్ బ్రిడ్జ్ పోజ్), లెగ్స్ అప్ ది వాల్ పోజ్ వంటి కొన్ని ఆసనాలు ఎంచుకోవడం మంచిది.
3. ఆరోగ్యకరమైన కీళ్ళుఇంటి నుంచి పని చేయడం, ఎటూ కదలకుండా ఎక్కువ సమయం కంప్యూటర్లు, ల్యాప్ టాప్ ల ముందు కూర్చోవడం వల్ల కీళ్ల పనితీరు మందగిస్తుంది. కీళ్లలో ఉండే సైనోవియల్ అనే ద్రవం జాయింట్లకు తాజా ఆక్సిజన్ ను, పోషకాలను అందిస్తుంది. ఎక్కువసేపు కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చుంటే కీళ్ల వద్ద ఉండే ఈ ద్రవం సరిగ్గా ప్రవహించదు. తద్వారా ఆ ప్రదేశంలో చిక్కుకున్న గాలి, బుడగలుగా ఏర్పడుతుంది. దీన్ని నివారించడానికి యోగా చేయాలి. కొన్ని ఆసనాలు కీళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేస్తాయి. కీళ్లను పూర్తి స్థాయిలో కదిలించడం వల్ల సైనోవియల్ ద్రవం ప్రవాహం సక్రమంగా ఉంటుంది. దీంతో కీళ్ల సమస్యలు దరిచేరవు.
4. మంచి నిద్ర
ఆఫీసుల్లో చేసే పనితో పోలిస్తే ఇంటి నుంచి పని చేయడమే కష్టమని ఉద్యోగులు భావిస్తున్నారు. ఎక్కువ సమయం పని చేయాల్సి రావడమే ఇందుకు కారణం. ఇది నిద్రలేమి సమస్యకు కారణం కావచ్చు. దీన్ని నివారించడానికి యోగా, ధ్యానంలో మంచి మార్గాలు ఉన్నాయి. ఒత్తిడి, ఆందోళన, అధిక రక్తపోటును నియంత్రించడానికి యోగాసనాలు సహాయపడతాయి. దీంతో ప్రశాంతంగా నిద్రపోతారు. దీంతో మీకు కావాలసిన విశ్రాంతి లభిస్తుంది. యోగా, ధ్యానం చేయడం వల్ల నిద్రను ప్రభావితం చేసే మెలటోనిన్ హార్మోన్ సక్రమంగా విడుదల అవుతుంది. ఇవి ఆందోళన, నిరాశ, దీర్ఘకాలిక నొప్పి, ఒత్తిడిని నివారించగలవు.

ప్రతీకాత్మక చిత్రం
5. మైగ్రేన్, తలనొప్పి నుంచి ఉపశమనం
వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంపిక వల్ల పని గంటలు పెరిగాయి. దీంతో తగినంత విరామం, ప్రశాంతత లభించట్లేదు. ఇవి తలనొప్పి, కంటి నొప్పి, మైగ్రేన్లకు దారితీసే అవకాశం ఉంది. వీటికి సహజ చికిత్సమార్గాలైన యోగా, ధ్యానంతో మంచి ఉపశమనం ఉంటుంది. కొన్ని రకాల మైగ్రేన్లు ఎలాంటి మందులకూ తగ్గవు. అలాంటి వారు నిపుణుల సూచనలతో ఆసనాలు, ధ్యానం వంటివి ఎంచుకోవాలి.