news18-telugu
Updated: March 14, 2020, 6:20 AM IST
డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫోటో)
Coronavirus in America : ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ అన్ని దేశాల్నీ భయపెడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని అంటువ్యాధిగా ప్రకటించడంతో అమెరికా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... అమెరికాలో నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆరోగ్య శాఖకు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. అలాగే... రాష్ట్రాలు ఎక్కువ నిధులు ఖర్చు చేసేందుకు వీలవ్వబోతోంది. ఇందుకోసం ట్రంప్ ప్రభుత్వం రాష్ట్రాలకు 50 బిలియన్ డాలర్లు కేటాయించింది. కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని దేశాలతో కలిసి పనిచేస్తామని ట్రంప్ ప్రకటించారు. తాజా నిధుల విడుదలతో రోగులకు ప్రత్యేక చికిత్స అందించవచ్చన్నారు. అమెరికాలో తాజాగా ఏడుగురు చనిపోవడంతో... మృతుల సంఖ్య 48కి చేరింది. కొత్తగా ఏకంగా 500కు పైగా కేసులు నమోదయ్యాయి. దాంతో కేసుల సంఖ్య 2270కి చేరింది. 2009లో H1N1 వైరస్ సోకినప్పుడు ఇలాగే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది అమెరికా. తాజా ప్రకటనతో... ఇప్పటివరకూ 25 బెడ్లకు మాత్రమే పరిమితమయ్యే ఆస్పత్రులు... ఇప్పుడు బెడ్ల సంఖ్య పెంచుకోవచ్చు. అలాగే... ఎలాంటి పేషెంట్లనైనా అడ్మిట్ చేసుకోవచ్చు. ఇంతకుముందులా 96 గంటల్లో డిశ్చార్జి చెయ్యాలనే రూల్ ఇప్పుడు ఉండదు.
అమెరికాలో చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే స్కూళ్లు మూతపడ్డాయి. కొన్ని ఆఫీసుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అమలవుతోంది. మెక్సికోతో సరిహద్దుల్ని మూసివేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఎందుకంటే మెక్సికో నుంచీ కరోనా వ్యాధిగ్రస్థులు అమెరికాకు వచ్చే ప్రమాదం ఉందని ట్రంప్ అంటున్నారు. ఐతే... ట్రంప్ వ్యాఖ్యల్ని మెక్సికో ఖండించింది. తమ దేశంలో 16 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయనీ, అలాంటప్పుడు... తమ దేశ ప్రజలు అమెరికాలోకి వస్తే... తమకే నష్టం అన్నారు అక్కడి పాలకులు. అమెరికన్ల నుంచే మెక్సికన్లకు కరోనా సోకే ప్రమాదం ఉందన్నారు.
Published by:
Krishna Kumar N
First published:
March 14, 2020, 6:20 AM IST