కరోనా వ్యాక్సిన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) శుక్రవారం శుభవార్త తెలిపారు. భారత్‌లో మూడు కరోనా వ్యాక్సిన్లు వివిధ క్లినికల్ దశల్లో ఉన్నాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. కొన్ని వారాల్లోనే కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు నమ్ముతున్నారని మోదీ చెప్పారు. దేశంలో కోవిడ్-19 పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో వర్చువల్ విధానంలో శుక్రవారం అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సందర్భంగా దేశీ కరోనా వ్యాక్సిన్ల పురోగతితోపాటు వ్యాక్సిన్ పంపిణీ తదితర కీలక అంశాలను ప్రధాని మోదీ రాజకీయ పార్టీలతో పంచుకున్నారు. "భారత్ కోవిడ్ వ్యాక్సిన్ మరింత ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం లేదని నిపుణులు భావిస్తున్నారు. అంటే రాబోయే కొద్ది వారాల్లోనే కోవిడ్ వ్యాక్సిన్లు సిద్దంగా ఉంటాయని వారు చెబుతున్నారు. ప్రపంచం మొత్తం చౌకైన, సమర్థవంతమైన కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. ఇందుకోసం అన్ని దేశాలు భారత్ వైపే చూస్తున్నాయి. మన శాస్త్రవేత్తలు ఇందుకోసం కష్టపడి పనిచేస్తున్నారనే విషయాన్ని మీకు చెబుతన్నాను. దేశంలో మొత్తం ఎనిమిది కరోనా వ్యాక్సిన్లు అభివృద్దిలో ఉన్నాయి. అందులో మూడు వ్యాక్సిన్ వివిధ క్లినికల్ ట్రయల్స్ దశల్లో ఉన్నాయి"అని మోదీ తెలిపారు.
కరోనా వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపిన వెంటనే వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని మోదీ తెలిపారు. ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్స్, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వృద్దులకు వ్యాక్సినేషన్లో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు మోదీ చెప్పారు. వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్ర, రాష్ట్ర బృందాలు కలిసి పనిచేయనున్నట్టు పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోల్చినప్పుడు.. భారత్‌లో వ్యాక్సిన్ పంపిణీ కోసం భారీ నెట్వర్క్ ఉందని అన్నారు. రాష్ట్రాలతో చర్చలు జరిపిన తర్వాతనే వ్యాక్సిన్ ధరపై నిర్ణయం తీసుకుంటానమని ప్రధాని మోదీ వెల్లడించారు.
ఈ అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ పాల్గొన్నారు. ఐదు అంతకంటే ఎక్కువ మంది ఎంపీలు కలిగిన 12 ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఈ అఖిలపక్ష భేటీకి హాజరైనట్టు పీటీఐ పేర్కొంది.
ఇక, కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ కూడా కొద్దిరోజుల క్రితం ఇదేరకమైన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది తొలి మూడు నాలుగు నెలల్లోనే దేశంలోని ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జూలై-ఆగస్టు నాటికి సుమారు 25 నుంచి 30 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించే ప్రణాళికలు కేంద్రం వద్ద ఉన్నట్టు వెల్లడించారు.
Published by:Sumanth Kanukula
First published:December 04, 2020, 15:54 IST