కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందో లేదో తెలియదు కానీ.. పలు రాష్ట్రాల్లో ఇది ఎన్నికల అంశంగా మారిపోతోంది. బీహార్లో తాము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని బీజేపీ ప్రకటించింది. తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే రకమైన హామీ ఇచ్చింది. దీంతో ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తారా ? ఇతర రాష్ట్రాల ప్రజల సంగతి ఏంటనే వాదనలు మొదలయ్యాయి. తాజాగా దీనిపై ప్రధాని నరేంద్రమోదీ క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన ప్రధాని నరేంద్రమోదీ.. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ను అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.
ఏ ఒక్క వ్యక్తినీ విడిచిపెట్టకుండా, అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తేస్తామని ప్రకటించారు. ఎవరినీ మరిచిపోమని అన్నారు. అయితే మొదట మాత్రం కోవిడ్ వారియర్స్పైనే సహజంగా దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. పంపిణీ విషయంలో జాతీయ నిపుణుల బృందం ఏర్పాటైందని, వాళ్లే ఇందుకు సంబంధించి ఓ ప్రాధాన్యత క్రమాన్ని రూపొందిస్తారని అన్నారు. వ్యాక్సిన్ ను నిల్వచేయడానికి 28,000 కోల్డ్ చైన్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలోని చివరి మూలల్లో ఉన్న వారికి కూడా వ్యాక్సిన్ అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు.
లబ్ధిదారుల నమోదు, టీకాలను వేసేందుకు ఒక డిజిటల్ వేదికను కూడా సిద్ధం చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలియజేశారు. వైరస్ ఎపుడు ఎలా విస్తరిస్తుందో అర్థం కావడం లేదని అన్నారు. ఒకసారి గుజరాత్, మరోసారి కేరళ, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తిస్తున్నామని అన్నారు. అంతలోనే పరిస్థితి అదుపులో ఉన్నట్లు అనిపిస్తోందని.. మళ్లీ కొన్ని నెలల తరువాత అధ్వాన్నంగా మారుతోందని ప్రధాని వ్యాఖ్యానించారు. అందుకే అక్టోబర్ 20న దేశానికి తాను ఇచ్చిన సందేశంలో చెప్పినట్టుగానే ఫేస్ మాస్క్, చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు.
Published by:Kishore Akkaladevi
First published:October 29, 2020, 15:06 IST