Home /News /coronavirus-latest-news /

PHONE SCREEN TESTING METHOD TO FIND COVID 19 RESEARCHERS FOUND NEW METHOD AK GH

Phone Screen Test: స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌తో కరోనా టెస్ట్.. కొత్త పద్ధతిని కనిపెట్టిన సైంటిస్టులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Phone Screen Test: వైరస్‌ని వ్యాప్తి చేసే వంద శాతం వ్యక్తుల్లో 81.3 శాతం మందిలో వైరస్ వారి మొబైల్ స్క్రీన్ పై కూడా ఉండడాన్ని పరిశోధకులు గుర్తించారు.

కరోనా మహమ్మారి ఎంత మందిని ఇబ్బంది పెడుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా కేసులను వీలైనంతగా తగ్గించడానికి ఉన్న మార్గాల్లో ఎక్కువ మందికి టెస్టులు చేయడం, పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేట్ చేయడం చాలా ముఖ్యమైనది. అయితే కరోనా టెస్టులు అనగానే ముక్కు, నోట్లోంచి స్వాబ్స్ తీసుకొని చేసే టెస్టులే గుర్తొస్తాయి. ఈ టెస్టులు ఇబ్బందికరంగా ఉండడమే కాక ఇతరులకు కూడా ఆ వ్యాధి సోకే ప్రమాదాన్ని కలిగిస్తాయి. అందుకే సులువుగా ఇంట్లోనే టెస్టులు చేసుకునే పద్ధతులను కనిపెట్టే దిశగా ప్రస్తుతం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే స్మార్ట్ ఫోన్ సాయంతో శాంపిల్స్ తీసుకునే కొత్త పద్ధతి అందరినీ ఆకర్షిస్తోంది.

ఇది చాలా తక్కువ ఖర్చులో శరీరానికి ఎలాంటి హాని కలిగించకుండా ఫోన్ స్క్రీన్ నుంచి శాంపిల్ తీసుకునే ప్రక్రియ. దీన్ని ఫోన్ స్క్రీన్ టెస్టింగ్ (PoST) అని పిలుస్తున్నారు. ఈ పద్ధతి పేద, మధ్య స్థాయి దేశాలకు వరం అని చెప్పుకోవచ్చు. యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ (యూసీఎల్) కి చెందిన రీసర్చర్లు ప్రజలు ఉపయోగించే ఫోన్ స్క్రీన్ల నుంచి శాంపిల్స్ సేకరించారు. RT-PCR పరీక్షలో పాజిటివ్ అని తేలినవారికి ఈ పరీక్షలో కూడా పాజిటివ్ అనే ఫలితం వచ్చిందని వారు వెల్లడించారు. యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ వారు నిర్వహించిన పరీక్షల్లో 540 మందికి PoST, RT-PCR రెండు టెస్టులు నిర్వహించారు.

దీనికి సంబంధించిన పరిశోధనను ఈ లైఫ్ అనే జర్నల్లో ప్రచురితం చేశారు. ఇందులో భాగంగా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న ఈ నేపథ్యంలో కరోనాను అడ్డుకోవడానికి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని వివరించారు. అంతే కాదు.. ఈ PoST పరీక్ష ద్వారా కరోనాను గుర్తించడంతో పాటు భవిష్యత్తులో వచ్చే కొత్త వేరియంట్లను కూడా సులువుగా గుర్తించేందుకు వీలుంటుందని వారు వెల్లడించారు.

అసలేంటీ PoST
ఈ పరీక్ష RT-PCR తో పోల్చితే ఎలాంటి ఇబ్బంది కలిగించని, శరీరం లోపలికి స్వాబ్ స్టిక్‌ను గుచ్చాల్సిన అవసరం లేకుండా నిర్వహించే పరీక్ష అని చెప్పుకోవచ్చు. దీనితో ఖర్చు కూడా చాలా తక్కువ. ఇందులో ఫోన్ స్క్రీన్ నుంచి స్వాబ్స్ సేకరిస్తారు. ఆ తర్వాత వీటిని సెలైన్ వాటర్ సొల్యూషన్ లో ఉంచుతారు. ఆ తర్వాత మిగిలిన పరీక్షల్లో చేసినట్లుగానే టెస్ట్ నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన మెషినరీని కూడా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ వారు తయారుచేస్తుండడం విశేషం. వైరస్ ని వ్యాప్తి చేసే వంద శాతం వ్యక్తుల్లో 81.3 శాతం మందిలో వైరస్ వారి మొబైల్ స్క్రీన్ పై కూడా ఉండడాన్ని పరిశోధకులు గుర్తించారు. అంతే కాదు.. ఈ పరీక్షల్లో ఆల్ఫా, బీటా, గామా వంటి వైరస్ వేరియంట్లను కూడా సులువుగా గుర్తించగలిగారు.

ప్రస్తుతం కరోనాను గుర్తించేందుకు RT-PCR (రియల్ టైమ్ రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పాలిమరేస్ చెయిన్ రియాక్షన్) అనే పరీక్షను ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా SARS-CoV-2 వైరస్ లోని న్యూక్లిక్ యాసిడ్‌ని గుర్తిస్తున్నారు. దీనికోసం గొంతు ముక్కు నుంచి స్వాబ్స్ తీసుకుంటారు. ఇది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. అంతేకాదు.. ఈ పరీక్షలో కేవలం డీఎన్‌ఏను మాత్రమే చెక్ చేస్తారు కాబట్టి కేవలం వైరస్ ఉందా? లేదా? అన్న విషయాన్నే ఇది గుర్తిస్తుంది. ఆ వ్యక్తి శరీరంలో వైరస్ చనిపోయి ఉందా? యాక్టివ్ గా ఉందా? అన్న విషయాన్ని ఇది గుర్తించలేదు. కరోనా నుంచి రికవర్ అయ్యారా? లేదా? అని గుర్తించేందుకు ఈ పరీక్ష ఉపయోగపడదు.

మరో పరీక్ష అయిన రాపిడ్ యాంటీజెన్ కరోనా వైరస్‌కి ఉండే ప్రొటీన్‌ని గుర్తిస్తుంది. ఈ పరీక్ష చాలా వేగంగా పూర్తవుతుంది. కేవలం పదిహేను నిమిషాల్లోనే దీని ఫలితం రావడం విశేషం. ఈపాటికే కరోనా లక్షణాలు ఉన్నవారికే ఈ పరీక్షను చేస్తుంటారు. అయితే దీని ద్వారా ఫలితం ఎప్పుడూ సరైనదే వస్తుందని చెప్పే అవకాశం లేదు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Corona virus, Coronavirus, Covid test

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు