బ్రిటన్ను వణికిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కొత్త రకం కరోనా వైరస్ భారత్‌లోకి కూడా వచ్చేసిందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లండన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఢిల్లీలో ఐదుగురు,చెన్నైలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నిన్న రాత్రి లండన్ నుండి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న 266 మంది ప్రయాణికులు, సిబ్బందిలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే వీరికి సోకిన కరోనా కొత్త రకానికి చెందినదా అనే అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు.. వారి నమూనాలను పరిశోధన కోసం ఎన్‌సిడిసికి (నేషనల్ సెంటర్ ఫర్ డిసిస్ కంట్రోల్ ) అధికారులు పంపించారు.
లండన్ నుంచి ఢిల్లీ మీదుగా చెన్నై వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ సోకినట్టు తేలింది. ఇక చెన్నైలో లండన్ నుంచి వచ్చిన మరో 14 మంది ప్రయాణికులను పరిశీలనలో ఉంచారు. లండన్‌తో ప్రయాణ సంబందం ఉన్న 1088 మందిని గుర్తించి పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించిన తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.
మరోవైపు కొత్త రకం కరోనా వైరస్ భారత్‌లోకి రాకుండా ఉండేందుకు భారత్, బ్రిటన్ మధ్య నడిచే విమానాలను డిసెంబర్ 31 వరకు రద్దు చేస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు గత రెండు వారాల్లో యూకే నుంచి భారత్‌కు వచ్చిన వారు వైరస్ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.
ఇదిలా ఉంటే తమ దేశంలో కొత్తరకం కరోనా వైరస్ నియంత్రణలో లేదని బ్రిటన్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మాట్ హాన్కాక్ రెండు రోజుల క్రితం ప్రకటించారు.కరోనా విజృంభణ నేపథ్యంలో లండన్‌తోపాటు ఆగ్నేయ ఇంగ్లండ్‌లో టైర్-4 లాక్ డౌన్ విధిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఈ క్రిస్మస్కు ప్రజలు ఇచ్చే ఉత్తమమైన బహుమతి వైరస్‌ను వ్యాప్తి చేయకుండా ఇంట్లో ఉండటమేనని మాట్ హాన్సాక్ తెలిపారు.
దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందేవరకు.. అవసరాన్ని బట్టి కొన్ని నెలల పాటు లండన్‌లో లాక్డౌన్ కొనసాగవచ్చని హాన్కాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు యూరోపియన్ దేశాలు ఆదివారం నుంచి బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను నిషేధించడం మొదలుపెట్టాయి. ఆదివారం నుంచి బ్రిటన్ ప్రయాణీకుల విమానాలపై నిషేధం అమల్లోకి వస్తుందని నెదర్లాండ్స్ ఇప్పటికే ప్రకటించింది. వేల్స్ మరోసారి లాక్ డౌన్లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో ఇంగ్లాండ్ నుంచి రాకపోకలపై స్కాట్ లాండ్ కూడా బ్యాన్ విధించింది.
బెల్జియం కూడా ఈ అర్ధరాత్రి నుండి బ్రిటన్ నుండి విమాన మరియు రైలు రాకలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. జర్మనీ ప్రభుత్వం కూడా ఇదే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక దేశంలో కొత్తరకం కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తోందని.. ఈ వైరస్ 70 శాతం ఎక్కువ వేగంగా ఇది వ్యాప్తి చెందుతోందని వైద్య అధికారులు తెలిపారు. ఈ కొత్తరకం వైరస్‌ను వాక్సిన్ నిరోధిస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవని ఆయన తెలిపారు. మరోవైపు ఈ నెల 8 నుంచే బ్రిటన్‌లో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించగా... ఇప్పటివరకు బ్రిటన్ లో 3లక్షల 50 వేల మందికి తొలి డోసు టీకా అందించారు. ఇక క్రిస్మస్ నేపథ్యంలో ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్‌లోనూ మళ్లీ లాక్డౌన్ ప్రకటించారు.