పాకిస్థాన్ మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఖాసిం గిలానీ వెల్లడించారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన ఖాసిం గిలానీ... ఇందుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్, నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరోను తప్పుబట్టారు. తన తండ్రి ప్రాణాలను ముప్పు తెచ్చిపెట్టినందుకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి, నేషనల్ అకౌంటబిలిటీ బ్యారోకు కృతజ్ఞతలు అంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. గురువారం రావల్పిండిలో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో విచారణకు హాజరు కావడం వల్లే గిలానీకి కరోనా సోకినట్టు తెలుస్తోంది. అనేక మంది ప్రజాప్రతినిధులకు కరోనా సోకుతున్న తరుణంలో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన జడ్జిని కోరారు. మార్చి 2న నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరోలో ఈ కేసు నమోదైంది.
గిలానీతో పాటు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, మాజీ అధ్యక్షుడు జర్దారీ తోషకానా నుంచి లగ్జరీ కార్లను పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో మాజీ ప్రధాని షాహిద్ ఖాకన్ అబ్బాసీతో పాటు రైల్వే మంత్రి షేక్ రషీద్‌కు కూడా కరోనా సోకింది. పాకిస్థాన్‌లో ఇప్పటివరకు 132405 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... వైరస్ కారణంగా 2551 మంది చనిపోయారు. దాదాపు 50 వేల మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:June 13, 2020, 19:20 IST