Oxygen Man: రూ. 22 లక్షల కారు అమ్మేసి ఉచితంగా ఆక్సిజన్ సరఫరా.. రియల్ హీరో

షానవాజ్

Oxygen Man: గతేడాది కరోనా సమయంలో తన స్నేహితుడి భార్య ఆక్సిజన్​ లేకపోవడంతో మరణించడాన్ని చూసి చలించిపోయాడు షనవాజ్​. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకుండా తనవంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో ముంబైలోని రోగులకు ఆక్సిజన్​ సరఫరా చేస్తున్నాడు.

  • Share this:
దేశంలో కరోనా సెకండ్ వేవ్​ విజృంభిస్తోంది. రోజుకు 3 లక్షలకు పైగా పాజిటివ్​ కేసులు నమోదవుతున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఆక్సిజన్, రెమిడిసివిర్ మందుల​ కొరత వేధిస్తోంది. సమయానికి ఆక్సిజన్​ అందక అనేక మంది కోవిడ్​ పేషెంట్లు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆక్సిజన్​ సరఫరా కోసం ప్రయత్నాలు ప్రారంభించినా.. ఒకేసారి పెరిగిపోయిన కేసులతో ఆక్సిజన్​ అందరికీ అందించడం కష్టంగా మారింది. మహారాష్ట్రలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీంతో కేంద్రం తొలి ‘ఆక్సిజన్​ ఎక్స్​ప్రెస్​ రైలు’ను అక్కడికి పంపించింది. అయినా కూడా ముంబైలో వేగంగా పెరుగుతున్న కోవిడ్​ కేసులతో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఒక యువకుడు ఆక్సిజన్​ సిలిండర్లను ఉచితంగా అందిస్తూ ముంబైలో ఎంతో మందికి ప్రాణదాతగా మారాడు.​ ముంబైలోని మలాడ్ ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల షానవాజ్​ షేక్​ ఒక్క ఫోన్​ కాల్​ ద్వారా ఆక్సిజన్​ సిలిండర్లను ఉచితంగా సరఫరా చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.

గతేడాది కరోనా సమయంలో తన స్నేహితుడి భార్య ఆక్సిజన్​ లేకపోవడంతో మరణించడాన్ని చూసి చలించిపోయాడు షానవాజ్​. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకుండా తనవంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో ముంబైలోని రోగులకు ఆక్సిజన్​ సరఫరా చేసే ఏజెంట్​గా పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రజలకు సకాలంలో సహాయం అందించడం కోసం ఒక హెల్ప్​లైన్​ నంబర్​ను, కంట్రోల్​ రూమ్​ను కూడా అతడు ఏర్పాటు చేశాడు. ఈ సంక్షోభ సమయంలో పేషెంట్లకు ఆక్సిజన్​ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఒక టీంని సైతం ఏర్పాటు చేసుకున్నాడు. వారికి ఉచితంగా ఆక్సిజన్​ సిలిండర్లను కొనుగోలు చేసేందుకు.. తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న రూ.22 లక్షల విలువ చేసే ఫోర్డ్​ ఎండీవర్​ ఎస్​యూవీ కారును సైతం అమ్మేశాడు. ​వచ్చిన డబ్బుతో160 ఆక్సిజన్​ సిలిండర్ల కొనుగోలు చేసి, వాటిని ఆపదలో ఉన్న కరోనా పేషంట్లకు ఉచితంగా సరఫరా చేస్తున్నాడు.

ప్రస్తుతం ఆక్సిజన్​ సిలిండర్ల సరఫరాకు ఊహించనంత డిమాండ్​ పెరిగింది. మూడు నెలల క్రితం, ఆక్సిజన్​ కోసం ప్రతిరోజు తనకు 50 కాల్స్ వచ్చేవని, ఇప్పుడు ప్రతిరోజూ 500 నుంచి 600 వరకు కాల్స్ వస్తున్నాయని షానవాజ్​ తెలిపాడు. తమ ఫౌండేషన్​ ద్వారా ఇప్పటివరకు నాలుగు వేల మందికి పైగా ఆక్సిజన్​ సరఫరా చేసినట్లు వెల్లడించాడు. కరోనాపై పోరాటంలో ప్రజలకు ఉచితంగా ఆక్సిజన్​ సిలిండర్లను సరఫరా చేస్తూ ‘ఆక్సిజన్​ మ్యాన్’​లా మారాడు. ఇప్పుడు షానవాజ్​ పేరు నెట్టింట్లో మార్మోగిపోతుంది. ఆయన సేవలకు హ్యాట్సాప్​ చెబతున్నారు నెటిజన్లు.

పాట్నాకు చెందిన గౌరవ్ రాయ్ అనే వ్యక్తి కూడా ఇలాంటి సేవలు అందిస్తున్నాడు. ఇప్పటివరకు 950 మందికి పైగా కరోనా రోగులకు ఆక్సిజన్​ సిలిండర్లను ఉచితంగా అందించి వారిని రక్షించాడు. రోజూ ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు తన చిన్న వాగన్ఆర్ కారులో ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేస్తున్నాడు. గౌరవ్ ఈ సేవలకు ఒక్క పైసా కూడా వసూలు చేయలేదు. గత ఏడాది నుంచి విరామం లేకుండా తన సేవలను కొనసాగిస్తున్నాడు. వీరిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సోషల్​ మీడియాలో వీరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published: