news18
Updated: November 5, 2020, 2:49 PM IST
ప్రతీకాత్మక చిత్రం
- News18
- Last Updated:
November 5, 2020, 2:49 PM IST
ప్రపంచవ్యాపంగా పలుచోట్ల కరోనా వైరస్ సెకండ్ వేవ్ పై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ పైనే అందరి ఆశలున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, బ్రిటీష్ సంస్థ ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న కోవిడ్–19 వ్యాక్సిన్ కీలక విషయాన్ని ప్రకటించింది. ఆక్స్‌ఫర్ట్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ చివరి దశ ట్రయల్స్ ఫలితాలు వచ్చే నెలలో రానున్నట్లు తెలుస్తోంది. ఈ చివరి ట్రయల్ విజయవంతమైన అనంతరం నియంత్రణ సంస్థల ఆమోదం వీలైనంత త్వరగా లభిస్తే వచ్చే ఏడాది జనవరి నాటికి భారత్ లో టీకా అందుబాటులోకి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. భారత్, యూకేలలో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ ఆధారంగా ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని వారు పేర్కొన్నారు.
కోవిడ్–19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా 1.2 మిలియన్ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలపై విలయతాండవం ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపి కోట్లాది మంది ప్రజల సాధారణ జీవితాన్ని తలకిందులు చేసింది. ఈ క్రమంలో కోవిడ్ వ్యాక్సిన్ పైనే అందరి ఆశలు నెలకొని ఉన్నాయి.
కాగా, వ్యాక్సిన్ చివరి దశ ట్రయల్స్ పై ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ఆండ్రూ పొలార్డ్ మాట్లాడుతూ ‘‘ఆక్స్ఫర్డ్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ పనిచేస్తుందో లేదో ఈ సంవత్సరం చివరి కల్లా తెలిసే అవకాశం ఉంది. చివరి దశ ట్రయల్స్ ఫలితాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఆ తరువాత క్లినికల్ ట్రయల్ డేటాను రెగ్యులేటర్లు జాగ్రత్తగా పరిశీలిస్తారు. టీకా తయారీ విజయవంతమైతే, ముందుగా టీకాను ఎవరికి అందుబాటులోకి తీసుకురావాలి అనే దానిపై రాజకీయ నిర్ణయం తీసుకుంటారు.’’ అని పొలార్డ్ తెలిపారు.

ప్రతీకాత్మక చిత్రం
జనవరిలో అందుబాటులోకి వచ్చే అవకాశం..
కాగా, క్రిస్మస్కు ముందే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్నకు "అది సాధ్యమయ్యే అవకాశం కూడా ఉంది. కానీ ప్రస్తుతం దానిపై నేను స్పష్టతనివ్వలేను.’’ అని పోలార్డ్ పేర్కొన్నారు. అయితే, కోవీషీల్డ్ పేరుతో వస్తున్న ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం మంచి ఫలితాలనిస్తోందని, ఫలితాలు వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, జనవరిలో అందుబాటులో వస్తుందని భావిస్తున్న ఈ వైరల్ వెక్టర్ టీకా చింపాంజీలలో ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే సాధారణ కోల్డ్ వైరస్ బలహీనమైన వెర్షన్ నుండి తయారు చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ను AZD1222 లేదా ChAdOx1 nCoV-19 అని కూడా పిలుస్తారు.
చింపాంజీలలో సాధారణంగా సోకే కోల్డ్ వైరస్ జన్యుపరంగా స్పైక్ ప్రోటీన్ అని పిలవబడే జన్యువు నుండి తీసుకోబడింది. ఇది మానవ కణాలలోకి ప్రవేశించడానికి కరోనావైరస్ ను ఉపయోగించుకుంటుంది. ఆక్స్ఫర్డ్ టీకా పనిచేస్తే, మహమ్మారి నుంచి ప్రపంచ దేశాలను కాపాడే గొప్ప ఔషధంగా మారుతుంది. అయితే, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రపంచం సాధారణ స్థితికి రాకపోవచ్చు. టీకాలు వేయడానికి మరింత సమయం పడుతుందని ఆండ్రూ పోలార్డ్ అభిప్రాయపడ్డారు.
Published by:
Srinivas Munigala
First published:
November 5, 2020, 2:47 PM IST