COVID-19: ఆఫీసుల్లో కరోనా కట్టడి ఎలా..? ఈ సింపుల్ సూత్రాలను పాటించండి

ప్రతీకాత్మక చిత్రం

భవనాల ఎయిర్ మేనేజ్​మెంట్ సిస్టమ్స్​, సెంట్రల్ ఎయిర్ ఫిల్టరేషన్​ సామర్థ్యాలను పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలని, ఎక్కువగా బయటి గాలి వచ్చేలా జాగ్రత్త పడాలని కేంద్రం స్పష్టం చేసింది.

  • Share this:
ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా ఆందోళనే కనిపిస్తోంది. అంతలా వైరస్ రెండో వేవ్ విజృంభిస్తోంది. మొదటి వేవ్​ కంటే ఇప్పుడు వ్యాప్తి తీవ్రత అధికంగా ఉండడంతో కేసులు సైతం ఎక్కువగా నమోదవుతున్నాయి. బయటి ప్రదేశాలతో పాటు ఆఫీసులు, ఆడిటోరియాలు, షాపింగ్ మాల్స్ లాంటి లోపలి (ఇండోర్) ప్రాంతాల్లోనూ కరోనా వ్యాప్తి జరుగుతోంది. గాలి ద్వారా కూడా కరోనా విస్తరణ జరుగుతుందని గుర్తించడంతో లోపలి ప్రదేశాల్లో ఉన్నా జాగ్రత్తగా ఉండాల్సిందే. లోపలి ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్​ సైంటిఫిక్ అడ్వైజర్​ కొన్ని సూచనలు చేసింది. గాలి ద్వారా వైరస్ విస్తరించకుండా మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని, ఇది చాలా కీలకమంటూ మరికొన్ని తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించింది.

‘ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి కరోనా సోకే ప్రమాదాన్ని వెంటిలేషన్ తగ్గించగలదు. పని ప్రదేశాల్లో, ఇళ్లలో వెంటిలేషన్ ద్వారా వైరస్ వ్యాప్తి చెందే రిస్క్ తక్కువవుతుంది. ఆఫీసులు, ఇళ్లలోకి బయటి గాలి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. అలాగే ఎక్కువ మంది గుమిగూడే లోపలి ప్రదేశాల్లోనూ బయట నుంచి గాలి వచ్చేలా వెంటిలేషన్​ బాగా ఉండాలి’ అని అడ్వైజర్​ సూచించింది. వెంటిలేషన్ మెరుగుపరుచుకునే మార్గాలను కూడా అడ్వైజర్ చెప్పింది. సులువైన మార్గాలతో ఆఫీసులు, ఇళ్లు, బిల్డింగ్స్​లో బయటి గాలి వచ్చేలా చేయవచ్చని చెప్పింది. కిటికీలు, తలుపులు తీసి ఉంచడం, ఫ్యాన్లు వాడడం వంటివి చేయడం వల్ల బయటి గాలి వచ్చి లోపల వాయు నాణ్యత పెరుగుతుందని చెప్పింది.

అలాగే ఆఫీస్ భవనాలు, ఆడిటోరియాలు, షాపింగ్​ మాల్స్​లో రూఫ్ వెంటిలేటర్లను ఏర్పాటు చేస్తే గాలి నాణ్యత పెరుగుతుందని సూచించింది. భవనాల ఎయిర్ మేనేజ్​మెంట్ సిస్టమ్స్​, సెంట్రల్ ఎయిర్ ఫిల్టరేషన్​ సామర్థ్యాలను పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలని, ఎక్కువగా బయటి గాలి వచ్చేలా జాగ్రత్త పడాలని స్పష్టం చేసింది. కరోనా సోకిన వ్యక్తి దక్కినా, తుమ్మినా, మాట్లాడినా ఆ తుంపర్లు గాలిలో చేరుతాయి. వాటి ద్వారా ఇతర వ్యక్తుల శరీరాల్లోకి వైరస్ ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. తుంపర్ల ద్వారా కరోనా గాలిలో కూడా మనుగడ సాగిస్తుందని తేలడంతో ఇండోర్ ప్రాంతాల్లోకి బయటి గాలి వస్తే వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతుంది.

అలాగే కరోనా ఉన్నా ఎలాంటి లక్షణాలు లేని వారి వల్ల కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో లోపలి ప్రదేశాల్లో వెంటిలేషన్ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. కరోనాను నిత్యం అడ్డుకోవాలంటే ఎక్కడైనా మాస్కులు, భౌతిక దూరం, శానిటైజేషన్​ తప్పనిసరి. అలాగే ఒకేసారి రెండు రకాలైన మాస్కులను ధరించడం ద్వారా మరింత సామర్థ్యంగా వైరస్​కు అడ్డుకట్ట వేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
First published: