news18-telugu
Updated: November 9, 2020, 4:06 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఆశ్చర్యంగా ఉందా? లాక్ డౌన్ (lock down)తో సంతోషమా? అదికూడా కుటుంబాల్లో? లాక్ డౌన్ తో కష్టనష్టాలు మాత్రమే కాదు కొంత మంచి కూడా జరుగుతున్నట్లు ఇప్పుడిప్పుడే బయటికి వస్తోంది. కుటుంబ సంబంధాలు మరింత దృఢపడేలా చేస్తున్న లాక్ డౌన్ తో దంపతులు(couples) చక్కని సంబంధ బాంధవ్యాలు నెరుపుతున్నట్టు పలు దేశాల్లో తేలింది. ప్రతీ ఐదుగురు దంపతుల్లో కనీసం ఒక జంట తమ వైవాహిక బంధం చాలామటుకు మెరుగై, అత్యధిక ఆనందంతో, సంతృప్తిగా కుటుంబ జీవితం గడిపేలా లాక్ డౌన్ తమను మార్చిందని చెబుతున్నారు. కొన్ని జంటలు తాము విడిపోవాలనుకున్న ఆలోచనను సైతం వాయిదా వేసుకున్నట్లు చెబుతుండడం విశేషం.
రోజూ వీకెండే..సాధారణంగా కుటుంబ జీవితాన్ని ఆస్వాదించేందుకు వీకెండ్ (weakend) కోసం కాచుకు కూర్చునేవారంతా ఇప్పుడు రోజూ వీకెండ్ లానే సాగుతుండడంతో ఆనందంగా ఉన్నారని తాజాగా తేలింది. విడిపోవాలనుకున్న జంటలను కలుపుతున్న మహమ్మారి కొత్త జంటలకు (newly married couple) ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడిపే అవకాశం ఇస్తోంది. దీంతో ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు వీరికి సమయం కలిసి వస్తోంది. భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో దేనికీ తీరిక లేక ఇలా లేచి అలా పరిగెత్తేవారు. దీంతో ఏ పనిచేయాలన్నా, సరదాగా కలిసి భోజనం చేయాలన్నా.. వీకెండ్ కోసం వేచిచూడాల్సి వచ్చేదని, కానీ లాక్ డౌన్ కారణంగా వర్క్ ఫ్రం హోం (work from home) సౌలభ్యంతో చక్కగా ఫ్యామిలీ లైఫ్ ను గడుపుతున్నట్లు చెబుతున్నారు.
మ్యారేజ్ ఫౌండేషన్ (marriage foundation) అనే సంస్థ చేసిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు 10శాతం మంది దంపతులు మాత్రం తమ బంధం మరింత బలహీనపడినట్లు ఈ పరిశోధనలో వెల్లడించారు. బ్రిటన్ కు చెందిన ఎస్సెక్స్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో 2,559 మంది తల్లిదండ్రులు పొల్గొన్నారు. విడాకులు (divorce) తీసుకోవాలని జూన్ లో భావించిన కొందరు తల్లిదండ్రులు లాక్ డౌన్ తరువాత విడిపోవాలనే ఆలోచన విరమించుకున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ తమ ఆలోచనా ధోరణిపై విపరీతమైన మార్పులు తెచ్చిందని వీరు వివరిస్తున్నారు. తమ మధ్య విభేదాలను పరిష్కరించుకునేందుకు లాక్ డౌన్ లో వీరికి విరామ సమయం లభించింది. దీంతో అపార్థాలకు తావులేకుండా పోయిందని చెబుతున్న తల్లిదండ్రులు, తమ కుటుంబ జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నట్టు వెల్లడించారు.
ఉరుకులు, పరుగులకు స్మాల్ బ్రేక్
ఉరుకులు పరుగుల జీవితానికి చిన్నపాటి బ్రేక్ పడటంతో కాస్త రోజువారి ఒత్తిడి నుంచి ఉపశమనం లభించిందని చెబుతున్నారు. కరోనా తీవ్రత తారాస్థాయికి చేరడంతో బ్రిటన్ లో రెండవసారి లాక్ డౌన్ విధించారు. దీంతో కొన్ని కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కరోనా ఆంక్షలతో భార్యా భర్తలు తమ పిల్లలతో కలిసి విలువైన సమయం గడిపేలా అవకాశం ఇచ్చిందని చెబుతున్నవారంతా తమ బంధం మరింత బలపడిందని ఆనందిస్తున్నారు. దంపతులు కలిసి ఉండేందుకు ఇది దోహదపడుతోంది.
మరి మనదేశంలో..అమెరికా, బ్రిటన్, కెనడా, ఇటలీ ఇలా పలు ప్రపంచ దేశాల్లో లాక్ డౌన్ విధించిన సమయంలో కుటుంబ బాంధవ్యాలు విపరీతమైన మార్పులకు లోనయ్యాయి. ఆర్థిక అవసరాలతోపాటు, మానసికంగా, శారీరకంగా కుటుంబ జీవితం విలువను తెలుసుకునేలా చేసిన కరోనా మహమ్మారి సామాజిక జీవితానికి (social life) మాత్రం బ్రేక్ పడేలా చేసింది. అయితే మనదేశంలో మాత్రం గృహ హింస కేసులు విపరీతంగా పెరగ్గా, కొన్ని జంటలకు లాక్ డౌన్ మేలు చేసింది కూడా. కుటుంబానికి ఎక్కువ సమయం వెచ్చించలేని జీవిత భాగస్వాములు కొందరు ఈ సమయంలో ఇంటిపట్టున ఉంటూ మంచి చెడ్డలు చూసుకుంటూ, అందరికీ ఆనందాన్ని ఇచ్చేలా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించేలా చేసింది. అనేక మందిని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిన ఈ లాక్ డౌన్ మరి కొందరిలో ఇలా ఆనందం నింపడం విశేషం.
Published by:
Nikhil Kumar S
First published:
November 9, 2020, 4:06 PM IST