కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా మళ్లీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నా.. దీని కారణంగా ప్రమాదం ఎక్కువగా లేకపోవడంతో చాలామందికి ఊరట కలిగిస్తోంది. ఒమిక్రాన్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉండటం.. ఎక్కువమంది ఆస్పత్రి వరకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా లేకపోవడంతో.. దీని ప్రభావం తక్కువగానే ఉంది. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ సోకిన తరువాత బాధితుల్లో ఉత్పత్తయ్యే యాంటీబాడీల కారణంగా ఇతర వేరియంట్ల నుంచి రక్షణ ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఒమిక్రాన్ సోకిన తరవాత యాంటీబాడీలే కేవలం ఈ వేరియంట్‌పై మాత్రమే కాకుండా ఇతర కరోనా వైరస్‌లకు వ్యతిరేకంగా కూడా పనిచేస్తాయని ఐసీఎంఆర్ వెల్లడించింది.
వీటిలో డెల్టా వేరియంట్ కూడా ఉంది. ఇది భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో మిలియన్ల మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంది. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన తరువాత ఉత్పత్తయ్యే యాంటీబాడీలు డెల్టా వేరియంట్లకు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తాయని ఈ అధ్యయనంలో చెప్పబడింది. ఇది కాకుండా డెల్టా వేరియంట్‌తో మళ్లీ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా తక్కువ. ఓమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించిన ప్రత్యేక వ్యాక్సిన్‌ను రూపొందించడంపై ఐసీఎంఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చింది.
ఐసీఎంఆర్ అధ్యయనంలో ఒమిక్రాన్ సోకిన తరువాత ఉత్పత్తయ్యే యాంటీబాడీలు బి1, బీటా, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లకు వ్యతిరేకంగా పని చేస్తాయని కనుగొన్నారు. ఐసీఎంఆర్ తక్కువ సమయంలో ఈ అధ్యయనాన్ని పూర్తి చేసింది. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. అయితే ఇది కేవలం ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడిన వారిపై ఈ అధ్యయనం జరిగిందని ICMR తెలిపింది. ప్రస్తుతం ఈ అధ్యయనంపై ఇంకా సమీక్ష జరగలేదు.
ఇక వారం వ్యవధిలో రెండు కోట్లకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు అవడంపై ఆందోళన వ్యక్తం చేసిన WHO..వాటిలో అత్యధికంగా అమెరికా, బ్రిటన్, భారత్, ఫ్రాన్స్, బ్రెజిల్, ఇటలీ దేశాల్లోనే నమోదు అవుతున్నట్లు గుర్తించింది. వారం వ్యవధిలో అత్యధికంగా 50 వేల మరణాలు(కరోనా బారిన పడి) సంబవించినట్లు నివేదికలో పేర్కొంది. అమెరికా, బ్రిటన్, భారత్, రష్యా, ఇటలీ దేశాల్లో ఎక్కువ కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఆగ్నేయాసియా దేశాలైన భారత్, నేపాల్, బంగ్లాదేశ్‌లో జనవరి రెండో వారంతో పోల్చితే.. మూడోవారంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదు అయినట్లు WHO తన నివేదికలో తెలిపింది. రెండో వారంలో పోల్చితే మూడోవారంలో 36 శాతం కొత్త కరోనా కేసులు పెరగగా, మరణాలు 44శాతం పెరిగినట్లు WHO వెల్లడించింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.