Omycron New Symptoms in Telugu | ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Corona Varient) కరోనా వైరస్ ప్రజలను కలవరపెడుతోంది. దీని నుంచి ఎలా బయటపడాలని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త కొత్త రకాల అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన కరోనా వేరియంట్లు అన్నింటిలో కంటే కూడా ఈ ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) కూడా ప్రకటించింది. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండడం అనేది ఒమిక్రాన్ మరింత పెరగడానికి దోహదపడుతోందని కూడా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనాకు సంబంధించి ఎలాంటి లక్షణాలు (Omicron Symptoms) కనిపించినా కూడా నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరిస్తున్నారు. కొత్తగా ఒమిక్రాన్ లక్షణాన్ని వైద్య నిపుణులు గుర్తించారు.
ఇప్పటి వరకు కరోనా వైరస్ కు సంబంధించి వెలుగుచూసిన లక్షణాల్లో ముఖ్యమైనవి రుచి తెలియకపోవడం, జ్వరం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు. ఇలాంటి లక్షణాలన్నీ చాలా రోజుల నుంచి గుర్తించినవే. అయితే, ఇవన్నీ ఒమిక్రాన్ పేషెంట్లలో సహజంగా కనిపించలేదు. తాజాగా వెల్లడైన డేటాను పరిశీలిస్తే 50 శాతం మంది కరోనా పేషెంట్లు మాత్రమే జ్వరం, రుచి లేకపోవడం లాంటి లక్షణాలను కలిగిఉన్నారు. ఇలాంటి లక్షణాలు లేని వారిని కూడా కరోనా వ్యాపించింది. ఒమిక్రాన్ కు సంబంధించి వెల్లడైన కొత్త లక్షణం ఏంటంటే.. ఆకలి లేకపోవడం. మీకు ఈ మధ్య కాలంలో సరిగా ఆకలి వేయడం లేదని అనిపిస్తే మీరు కచ్చితంగా వైద్యులను సంప్రదించండి. కరోనా టెస్టు చేయించుకోండి.
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 33,750 కరోనా పాజిటివ్ కేసులు, 123 కరోనా మరణాలు నమోదయ్యాయి. 10,846 మంది గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలోని కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,45,582. మరోపక్క కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం.
భారత్‌లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,700కు చేరింది. దేశంలోని 23 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో అత్యధికంగా 510 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం గమనార్హం. తరువాత స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 87 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 17 ఒమిక్రాన్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ రిలీజ్ చేసిన డేటాలో పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.