'మేము మీ కోసం ఆస్పత్రిలో ఉన్నాం. మీరు మా కోసం ఇళ్లల్లో ఉండండి'. కరోనా నేపథ్యంలో కొందరు డాక్టర్ల సందేశం ఇప్పుడు సోషల్ మీడియాల్లో వైరల్గా మారింది. కరోనా దెబ్బకు అందరూ ఇళ్లకు పరిమితమైతే... వీళ్లు మాత్రం కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తూ కొత్త జీవితం ప్రసాదించేందుకు కృషిచేస్తున్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు, కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వైద్యులు అంతలా కష్టపడుతున్నారు. తాజాగా ఒడిశాకు చెందిన ఓ డాక్టర్.. తన తల్లి చనిపోయినా కరోనా విధుల్లో పాల్గొన్నారు. కని, పెంచిన అమ్మ మరణించినా సరే.. ఆ బాధను గుండెల్లో దిగమింగి, కరోనాపై పోరాటానికి వెళ్లారు.
ఆయన పేరు అశోక్ దాస్. ఒడిశాలోని సాంబాల్పూర్లో కోవిడ్-19 నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. కరోనావైరస్పై ఓ వైపు అవగాహన కల్పిస్తూనే.. మరోవైపు కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఐతే 80 ఏళ్ల వయసున్న ఆయన తల్లి మంగళవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. అమ్మ చనిపోవడంతో అశోక్ దాస్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అంత బాధలోనూ తన డ్యూటీని పక్కనబెట్టలేదు అశోక్. కరోనావైరస్ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఒక వైద్యుడిగా తన బాధ్యతను మరచిపోలేదు. తల్లి చనిపోయిందన్న బాధను దిగమింగి.. కరోనాపై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు అశోక్ దాస్. తాను పనిచేసే ఆస్పత్రికి వెళ్లి కరోనా అనుమానితులకు చికిత్స చేశారు. సాయంత్రం డ్యూటీ అనంతరం తిరిగి ఇంటికి చేరుకొని తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తనకు ప్రజాసేవే ముఖ్యమని.. అమ్మ కూడా అదే చెప్పేదని అన్నారు అశోక్. ఈయన స్టోరీ తెలుసుకొని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'హ్యాట్సాఫ్ సార్.. సరిలేరు నీకెవ్వరు' అంటూ సెల్యూట్ చేశారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సైతం ఆయన్ను ప్రశంసించారు.
Published by:Shiva Kumar Addula
First published:March 20, 2020, 17:38 IST