కరోనా వ్యాక్సిన్ కావాలనుకునే వారు Co Win యాప్‌లో నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చాలా రోజుల నుంచి చెబుతోంది. అయితే ఈ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోలేని వాళ్లకి ప్రభుత్వం మరో అవకాశం కూడా కల్పించింది. 50 ఏళ్లు పైబడిన వారు, 50 ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు సులువుగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అన్ని మండలాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాల్లో ఆయా లబ్ధిదారులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే మీసేవ కేంద్రాల్లోనూ ఇందుకోసం ఏర్పాట్లు చేయబోతున్నారు. అక్కడ కూడా కోవిన్ యాప్ ద్వారానే రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియ జరుగుతుంది.
ఇక కేంద్రం మొదట చెప్పిన విధంగా ఎవరికి వారు సొంతంగా కోవిన్ యాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. గ్రామాలు, పట్టణాల్లో సొంతంగా యాప్‌లో నమోదు చేసుకోవడం సాధ్యంకాని వారి కోసం ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుంది. అయితే 50 ఏళ్లు పైబడిన వారు తమ పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం తీసుకురావాల్సి ఉంటుంది. అది లేనివారు ఓటర్ గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ తదితర ప్రభుత్వం ప్రకటించిన నిర్ణీత ఐడీ కార్డులు తెస్తే ఏదో ఒకదాన్ని అప్లోడ్ చేసి వారి పేర్లను నమోదు చేస్తారు. ఇటు 50 ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను ఎలా నమోదు చేస్తారన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వీరి నమోదులో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే 1075 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఆ నంబర్ 24 గంటలూ అందుబాటులో ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
ఇక తెలంగాణలో 75 లక్షల మందికి మొదటి దశలో వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం ఈ నెల 13న ప్రారంభమవుతుందని కేంద్రం ఇటీవల రాష్ట్రాలకు సంకేతాలు ఇచ్చింది. అయితే వ్యాక్సిన్ల సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం ఒకటికి నాలుగుసార్లు తనిఖీలు చేస్తుండటంతోనే జాప్యమవుతోందని తెలుస్తోంది. వ్యాక్సిన్లు తయారైనప్పటికీ బ్యాచ్‌ల వారీగా వాటిని మరోసారి పరీక్షిస్తున్నారు. ఎక్కడైనా లోపం ఉంటే వెంటనే వాటిని పక్కనపెడతారు. ఈ విషయంలో కసరత్తు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇటు రాష్ట్రానికి మొదటి విడతగా ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన 6.5 లక్షల డోసుల కరోనా వ్యాక్సిన్ టీకాలు పుణే నుంచి ప్రత్యేక ఇన్సులేటెడ్ కార్గో విమానంలో హైదరాబాద్‌కు వస్తాయని అధికారులు వెల్లడించారు.
Published by:Kishore Akkaladevi
First published:January 08, 2021, 09:22 IST