తొలి దశలో ప్రాధాన్యత క్రమంలో ఉన్న 30 కోట్ల మందికి ఇవ్వనున్న వ్యాక్సిన్ ఖర్చును ప్రభుత్వం భరించనుందని నీతి ఆయోగ్ సభ్యుడు, జాతీయ కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు వినోద్ పాల్ తెలిపారు. రాబోయే 6-8 నెలల్లో కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్లుగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలతో పాటు ఇతర వ్యాధులతో బాధపడే పెద్దవాళ్లకు మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. 29 వేల వ్యాక్సినేషన్ పాయింట్లకు వ్యాక్సిన్ అందించేందుకు 31 హబ్‌లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం దేశవ్యాప్తంగా ఎన్నో ముందస్తు చర్యలు తీసుకున్నట్టు వినోద్ పాల్ తెలిపారు.
ఈ విషయంలో ప్రభుత్వాలు, ఇతర సంస్థలు అంతా ఒక్కటిగా పని చేస్తున్నామని అన్నారు. ప్రతి వ్యవస్థ సమన్వయంతో ముందుకు సాగుతోందని వెల్లడించారు. 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించేందుకు దేశం సిద్ధమైంది. ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇస్తామని అన్నారు. ఇందుకోసం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు. వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం ప్రాధాన్యత వర్గాలను ఎంచుకుందని వినోద్ పాల్ తెలిపారు. మొత్తం జనాభా కాకుండా కరోనా రిస్క్ ఉండే 30 కోట్ల మందిని ఎంచుకున్నట్టు వెల్లడించారు. కరోనా కారణంగా సంభవించే మరణాలు తగ్గించేందుకు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా భవిష్యత్తులో వ్యాక్సిన్ నిల్వలు పెంచుకునే సామర్థ్యాన్ని పెంచుతామని అన్నారు. దేశం మొత్తం కరోనాను ఎదుర్కొనే హర్డ్ ఇమ్యూనిటీ రావాలని అన్నారు. ఈ వైరస్ వ్యాప్తిని ఆపడమే అందరి లక్ష్యమని.. ఇందుకోసం వ్యాక్సిన్‌ను ఎక్కువమందికి ఇవ్వాలని అన్నారు. కాగా.. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ డ్రై రన్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హర్షవర్ధన్ తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం ఏ రకంగా అయితే సన్నద్ధమవుతామో.. అదే రకంగా వైద్య బృందాలను ఇందుకోసం పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని హర్షవర్ధన్ అన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:January 01, 2021, 21:24 IST