NORTH KOREA FIRED AT SOUTH KOREAN GOVT OFFICIAL AND BURNED HIS BODY SAYS SEOUL SK GH
దక్షిణ కొరియా అధికారిని తుపాకీతో కాల్చితగలబెట్టిన ఉ.కొరియా..కరోనా భయంతోనే?
కిమ్ జోంగ్ ఉన్, ఉత్తరకొరియా అధినేత
వారు గ్యాస్ మాస్క్లు, ప్రొటెక్టివ్ సూట్లను ధరించి వచ్చారు. చంపిన తరువాత బాధితుడి శరీరంపై గ్యాసోలిన్ పోసి నిప్పంటించారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఉత్తర కొరియా మరో ఘాతుకానికి పాల్పడింది. ఎప్పుడూ ఏదో ఒక సంఘటనతో వార్తల్లో నిలిచే ఆ దేశం తాజాగా ఒక దుశ్చర్యకు ఒడిగట్టింది. తమ దేశానికి చెందిన ఒక అధికారిని ఉత్తర కొరియా బలగాలు కాల్చి చంపాయని దక్షిణ కొరియా తెలిపింది. ఇరుదేశాల మధ్య ఉన్న వివాదాస్పద సముద్ర జలాల బోర్డర్ పరిధిలో నీటిలో తేలుతున్న చిన్నపడవపై కాల్చేసిన తమ అధికారి శవం ఉన్నట్టు దక్షిణ కొరియా ప్రభుత్వం గుర్తించింది. సరిహద్దుకు దక్షిణంగా ఉన్న ప్రాంతంలో అనధికార చేపల వేటను నియంత్రించడానికి పంపిన బృందంలోని ఆ అధికారి అనుకోని రీతిలో ప్రభుత్వ ఓడ నుంచి అదృశ్యమయ్యాడని తెలుస్తోంది.
మంగళవారం మధ్యాహ్నం దక్షిణ కొరియా అధికారి వెళ్లిన ప్రాంతానికి గ్యాస్ మాస్కులు ధరించిన తమ అధికారులను ఉత్తర కొరియా పంపింది. ఆ తరువాత అక్కడికి ఎందుకు వచ్చావని అతడిని ప్రశ్నించారు. అదేరోజు అతడిని ఉత్తర కొరియా నేవీ అధికారులు కాల్చి చంపారని దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు గ్యాస్ మాస్క్లు, ప్రొటెక్టివ్ సూట్లను ధరించి వచ్చారు. చంపిన తరువాత బాధితుడి శరీరంపై గ్యాసోలిన్ పోసి నిప్పంటించారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆ అధికారి ఎందుకు వెళ్లాడు?
చనిపోయిన అధికారి ఉత్తరం వైపు వెళ్లడానికి ఎందుకు ప్రయత్నించాడనేది ప్రశ్నార్థకంగా మారింది. బాధితుడు అక్రమంగా ఉత్తర కొరియాలోకి వెళ్లడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అతడు లైఫ్ జాకెట్ ధరించి, ఒక చిన్న పడవపై ప్రయాణిస్తుండగా ఉత్తర కొరియా నేవీ సిబ్బంది గుర్తించి పట్టుకున్నారని పేరు వెల్లడించని దక్షిణ కొరియా అధికారి ఒకరు చెప్పారు. ఆ వ్యక్తి ఉత్తర కొరియాకు వెళ్లాలనుకుంటున్నట్లు మిలటరీకి సమాచారం అందిందని ఆయన వివరించాడు.
కరోనా భయంతోనే చంపారా?
తమ దేశంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని ఉత్తర కొరియా చెబుతోంది. కానీ ఈ వాదనను విదేశీ నిపుణులు ఖండిస్తున్నారు. ఆ దేశంలో ప్రజారోగ్య వ్యవస్థ సక్రమంగా ఉండదు. దీనికి తోడు వైద్య సామగ్రి కోరత కూడా ఉంటుంది. దీంతో అక్కడ కరోనా మహమ్మారి వ్యాపిస్తే, దాని పరిణామాలుఉ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే కరోనా వచ్చిన వారిని కాల్చి చంపాలని ఉత్తర కొరియా అధికారులను కిమ్ ఆదేశించాడు. ఇందులో భాగంగానే అక్రమంగా సరిహద్దులు దాటి రావాలనుకున్న బాధితుడిని సైతం కాల్చి నిప్పంటించినట్టు తెలుస్తోంది.
స్పందించని ఉత్తర కొరియా
తప్పిపోయిన అధికారి సమాచారం గురించి బుధవారం దక్షిణ కొరియా దాయాది దేశాన్ని సంప్రదించింది. అమెరికా ఆధ్వర్యంలో పనిచేసే యూఎన్ కమాండ్ కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా ఉత్తర కొరియాకు సందేశం పంపింది. కానీ ఆ దేశం స్పందించలేదని దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తర కొరియా చర్యను దక్షిణ కొరియా తీవ్రంగా ఖండిస్తోందని ఆ దేశ సీనియర్ సైనిక అధికారి అహ్న్ యంగ్ హో చెప్పారు. బాధ్యులను శిక్షించాలని ఆయన కోరారు. దాయాది దేశమే తమ అధికారిని చంపిందనడానికి సాక్ష్యాలుగా కీలక సాంకేతిక ఆధారాలను సేకరించామని ఆయన పేర్కొన్నారు. చనిపోయిన 47 ఏళ్ల వ్యక్తి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మత్స్య శాఖకు చెందిన ప్రభుత్వ ఓడలో విధులు నిర్వర్తించే 18 మంది అధికారులలో బాధితుడు ఒకడు. అతడు కనిపించకుండా పోయిన తరువాత సహచరులు వెతకగా, ఓడలో అతడి బూట్లు మాత్రమే కనిపించాయి. అనంతరం ఎయిర్క్రాఫ్ట్ ద్వారా వెతికినా అతడి సమాచారం దొరకలేదని ఆ దేశ డిఫెన్స్ మినిస్ర్టీ తెలిపింది.
ఉత్తర కొరియాకు వెళ్లడం అరుదు
ఇరు దేశాల మధ్య ఇప్పటికే దెబ్బతిన్న సంబంధాలను ఈ సంఘటన మరింత పెంచుతుందని భావిస్తున్నారు. గతంలో ప్యాంగ్యాంగ్, వాషింగ్టన్ మధ్య జరిగిన అణు, దౌత్య చర్చలు ఎలాంటి ఫలితం లేకుండా ముగిసినప్పటి నుంచి ఉభయ కొరియా దేశాల మధ్య సంబంధాలు, సహకార కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోయాయి. జూన్లో దక్షిణ కొరియా పౌరులు సరిహద్దు మీదుగా తమకు వ్యతిరేకంగా కరపత్రాలను పంపడాన్ని నిరసిస్తూ, తమ భూభాగంలోని ఇంటర్ కొరియా అనుసంధాన కార్యాలయాన్నిఉత్తర కొరియా పేల్చివేసింది. రాజకీయ, ఆర్థిక కారణాల వల్ల గత 20 ఏళ్లలో దాదాపు 30,000 మందికి పైగా ఉత్తర కొరియన్లు దక్షిణ కొరియాకు పారిపోయినట్టు అంచనా. కానీ ఉత్తర కొరియాకు దక్షిణ కొరియన్లు వెళ్లడం చాలా అసాధారణమైన విషయం.