No Vaccine No Salary: కరోనా వ్యాక్సిన్ వేసుకోలేదా.. ఒకటో తారీఖు జీతం లేనట్టే.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోకుంటే సదరు ఉద్యోగిపై సంబంధిత శాఖ చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు.

  • Share this:
    దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం చూసిన తరువాత వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలు వ్యాక్సిన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. దీంతో టీకాలకు కొరత ఏర్పడింది. అయితే వ్యాక్సిన్ కావాలంటే దొరికని వాళ్లు ఉన్నట్టుగానే.. వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉన్నా.. అనేక అపోహల కారణంగా వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉన్నవాళ్లు కొందరు ఉన్నారు. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని శాస్త్రవేత్తల దగ్గర నుంచి ప్రభుత్వాల వరకు ఎంతగా చెబుతున్నా.. కొందరు తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఇలాంటి వాళ్లు సాధారణ ప్రజలైతే ఏమో అనుకోవచ్చు కానీ.. అన్నీ తెలిసిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇలా చేయడం ఉన్నతాధికారులకు ఆశ్చర్యం కలిగించింది.

    దీంతో ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు ప్రభుత్వ ఉద్యోగులందరూ వ్యాక్సిన్ కచ్చితంగా తీసుకునే విధంగా ఓ కొత్త నిబంధన తీసుకొచ్చారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని.. వ్యాక్సిన్ వేయించుకోని వాళ్లు నెల జీతం పొందలేరని బుధవారం ఫిరోజాబాద్‌ అధికారులు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ చంద్ర విజయ్ సింగ్..’నో వ్యాక్సిన్ నో శాలరీ’కి సంబంధించి ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. వ్యాక్సిన్ వేసుకున్న ఉద్యోగుల లిస్టును సిద్ధం చేయాలని.. అందరూ వ్యాక్సిన్‌ వేయించుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

    ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోకుంటే సదరు ఉద్యోగిపై సంబంధిత శాఖ చర్యలు తీసకుంటుందని తెలిపారు. వారికి జీతాన్ని నిలిపివేస్తుందని జిల్లా ఉన్నతాధికారి స్పష్టం చేశారు. టీకా తీసుకోని ఉద్యోగులకు మే నెల జీతం ఆపేయనున్నట్లు ప్రకటించారు. దీంతో జీతం ఆగిపోతుందనే భయంతో ఉద్యోగులు టీకా తీసుకునేందుకు ముందుకొస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. మొత్తానికి కరోనా టీకాలు ఉద్యోగులందరికీ వేసేందుకు ఉన్నతాధికారులు ఈ రకమైన ఆలోచన చేయడం కాస్త భిన్నంగా అనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: