Andhra pradesh: ఏపీలో వ్యాక్సినేషన్ కు బ్రేక్! రెండున్నర లక్షల వ్యాక్సిన్లు వృధా

Andhra pradesh: ఏపీలో వ్యాక్సినేషన్ కు బ్రేక్! రెండున్నర లక్షల వ్యాక్సిన్లు వృధా

ఏపీలో వ్యాక్సిన్ కొరత

ఏపీలో కరోనా వ్యాక్సిన్ నిండుకుందా? మరో రెండు రోజుల్లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ పంపిణీ పూర్తి అయిపోతే పరిస్థితి ఏంటి? కరోనా కేసులు భారీగా విస్తరిస్తున్న వేళ.. వ్యాక్సిన్ సరఫరా లేదనే వార్త కలవర పెడుతోంది. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా?

  • Share this:
    ఏపీలో కరోనా ప్రస్తుతం పంజా విసురుతోంది. మూడు నెలల కిందటి గరిష్టస్థాయికి ఇప్పుడు కేసులు చేరుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసులు 24 గంటల వ్యవధిలో రెండు వేల మార్కును దాటుతోంది. ఇలాంటి సమయంలో కరోనాని కట్టడి చేయడానికి ప్రధాన ఆయుదం వ్యాక్సినేషన్ మాత్రమే. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.  తాజాగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. కానీ ఇప్పుడు ఓ వార్త ఆందోళన పెంచుతోంది. ఏపీలో వ్యాక్సినేషన్ నిండుకుంది అనే వార్త కలవరపెడుతోంది.

    ప్రస్తుతం కొన్ని జిల్లాల్లోని సచివాలయాలకు ఇంకా వ్యాక్సిన్ రాలేదని తెలుస్తోంది. త్వరలో ఇస్తామని వాలంటీర్లు చెబుతూ ఉన్నారు. కొన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్లు నిలిచిపోయాయనే వార్తలు కాస్త భయపెడుతున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సరిపడ సరఫరా లేకపోవడంతో వ్యాక్సినేషన్ నిలిపివేస్తుేన్నామని అధికారులు సమాధానమిస్తున్నారు. ఏపీకి ఇప్పటి వరకు 38 లక్షల 44 వేల వ్యాక్సిన్లను కేంద్రం ఇచ్చినట్టు తెలుస్తోంది. అందులో ఇప్పటికే 32 లక్షల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. దీంతో ప్రస్తుతం కేవలం 2 లక్షల 6 వేల వ్యాక్సిన్లు మాత్రమే ఏపీలో అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది. అయితే సరాసరిన ప్రతి రోజు లక్ష వరకు వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. అంటే ఈ లెక్కన కేవలం రెండు రోజుల్లోనే మన దగ్గర ఉన్న స్టాక్ పూర్తయ్యే ప్రమాదం ఉంది.  మరోవైపు రెండున్నర లక్షల వరకు వ్యాక్సిన్లు వివిధ కారణాలతో వృధా అవ్వడం కూడా ఆందోళన పెంచుతోంది.

    ఈ వ్యాక్సినేషన్ కొరతపై ఏపీ ప్రభుత్వం కూడా స్పందించింది.  ఏపీలో వార్తలు వస్తున్నట్టు కరోనా వ్యాక్సినేషన్ కొరత ఉంది అన్న మాట వాస్తవం కాదన్నారు. ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికి 3 లక్షల 80 వేల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి అన్నారు. అయితే ఇది మూడు, నాలుగు రోజుల్లో పూర్తవుతాయని.. కొత్త స్టాక్ కావాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఇండెంట్ పెట్టామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.. అయితే కేంద్రానికి అన్ని రాష్ట్రాల నుండి వినతులు ఉన్నాయని.. కేంద్రం తమ దగ్గర ఉన్న స్టాక్. ఆయా రాష్ట్రాల్లో కేసులు.. అవసరాలను లెక్క చూసుకిని మనకు వ్యాక్సిన్లను త్వరగానే పంపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  కేంద్ర ప్రభుత్వం దశల వారీగా మన రాష్ట్రానికి వ్యాక్సిన్లను పంపిస్తుంది అన్నారు ఆళ్ల నాని.

    అలాగే లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ వార్తలపైనా క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న మాట వాస్తవమే అయినా.. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నామని.. అయితే లాక్ డౌన్, కర్ఫ్యూ పెట్టాల్సిన పరిస్థితి ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశారు. అందరికీ వ్యాక్సినేషన్ అందించడంతో పాటు.. కరోనా చికిత్స కోసం ఆస్పత్రులను పెంచుతామని.. ఏపీలో కరోనా విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు