సేఫ్ జోన్‌లోకి ఉమ్మడి పాలమూరు.. 5 జిల్లాల్లో కొత్త కేసులు లేవు

సేఫ్ జోన్‌లోకి ఉమ్మడి పాలమూరు.. 5 జిల్లాల్లో కొత్త కేసులు లేవు

ప్రతీకాత్మక చిత్రం

జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు కావడంతో అధికారులు మరింత పకడ్బందీగా కరోనా నివారణ చర్యలు చేపడుతున్నారు. అక్కడే ప్రాథమిక పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు

 • Share this:
  తెలంగాణలో ఈ వారంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. చాలా తక్కువ మందికి మాత్రమే పాజిటివ్ వస్తోంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు లేకపోవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా సేఫ్ జోన్‌లోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట జిల్లాల్లో కొన్ని రోజులుగా ఒక్క పాజిటివ్‌ కేసు రాలేదు. జోగులాంబ గద్వాల జిల్లాలో సైతం రెండు రోజులుగా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. ఇక వనపర్తి కరోనా ఫ్రీ జిల్లాగా కొనసాగుతోంది. ఈ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ఐనప్పటికీ అధికారులు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదేతీరు కొనసాగించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు.

  కరోనా పాజిటివ్‌ వచ్చిన కాలనీలపై ప్రధానంగా దృష్టిపెట్టారు. ఇతర కాలనీ నుంచి అక్కడికి రాకపోకలను నియంత్రిస్తున్నారు. మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల జిల్లాల్లో నియంత్రణ పకడ్బందీగా ఉండేందుకు ఇనుప బారికేడ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చిన కాలనీల్లో రాకపోకలకు ఒకే మార్గాన్ని అందుబాటులో ఉంచారు. జన సంచారం ఇదే తరహాలో నియంత్రిస్తే వైరస్‌ వ్యాప్తికి అవకాశముండదని అధికారులు భావిస్తున్నారు. ప్రజలు సైతం సామాజిక దూరం పాటించాలని, అవసరముంటే తప్ప ఇంటి నుంచి బయటికి రావద్దని సూచిస్తున్నారు. మరోవైపు ప్రజలకు కూడా వ్యాధి పట్ల అవగాహన రావడంతో.. ఇళ్లకే పరిమితమయ్యారు.

  కొన్ని ప్రాంతాల్లో మినహాయింపులు ఇచ్చినప్పటికీ జన మాత్రం బయటకు రావడం లేదు. ఉమ్మడి పాలమూరులో కొత్త కేసులు నమోదు కాకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో కూరగాయలు, కిరాణం దుకాణాలకు అధికారులు మినహాయింపులు ఇచ్చారు. సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచడానికి అవకాశమిచ్చారు. కానీ ఉదయం 11 గంటల తరవాత దుకాణాల వద్ద పెద్దగా జనం కనిపించలేదు. సాయంత్రం ఆరు గంటల తరవాత పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు.

  మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు కావడంతో అధికారులు మరింత పకడ్బందీగా కరోనా నివారణ చర్యలు చేపడుతున్నారు. అక్కడే ప్రాథమిక పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి అవసరమైన పరికరాలు ఇప్పటికే గద్వాలకు చేరుకున్నాయి. పరీక్షలు నిర్వహించే విధానాలపై జిల్లా వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ల్యాబ్ ప్రారంభిస్తే ప్రాథమికంగా పరీక్షలు అక్కడే నిర్వహించే అవకాశం ఉంది. ఆ పరీక్షల్లో అనుమానిత లక్షణాలు కనిపిస్తే నమూనాలు హైదరాబాద్‌కు పంపిస్తారు. అక్కడ వచ్చిన తుది ఫలితాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటారు. కొత్త కేసులు నమోదుకావడంతో ప్రస్తుతానికి ఉమ్మడి పాలమూరుకు చెందిన ఐదు జిల్లాలు సేఫ్ జోన్‌కు వచ్చినట్లే భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు