ఏపీలోకి నో ఎంట్రీ... బోర్డర్‌లో ఉన్నవారికి స్పష్టం చేసిన డీజీపీ

తెలంగాణ నుంచి వేలాాది మంది ఏపీలోని సొంత గ్రామాలకు వెళ్లేందుకు తెలంగాణ పోలీసుల నుంచి అనుమతి లేఖ తీసుకుని బయలుదేరారు. అయితే, వారిని అనుమతించబోమని సరిహద్దుల్లో పోలీసులు ఆపేశారు.

news18-telugu
Updated: March 26, 2020, 3:01 PM IST
ఏపీలోకి నో ఎంట్రీ... బోర్డర్‌లో ఉన్నవారికి స్పష్టం చేసిన డీజీపీ
తెలంగాణ నుంచి ఏపీ బోర్డర్లో నిలిచిపోయిన వాహనాలు
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లోని సొంత గ్రామాలకు వెళ్లాలనుకుని బయలుదేరి వచ్చి ఏపీ బోర్డర్‌లో నిలిచిపోయిన వారిని అనుమతించే ప్రసక్తే లేదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ ను జాతీయ విపత్తు గా ప్రకటించింది. ఎక్కడివారు అక్కడే ఉండాల్సిందిగా కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని దేశ ప్రధాని, ముఖ్యమంత్రి చేతులు జోడించి ప్రజలందరిని కోరారు. ఇది ఇలా ఉండగా నిన్నటి నుంచి కొందరు నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్ర ప్రదేశ్ లోనికి రావడానికి ప్రయత్నిస్తూ సరిహద్దు తనిఖీ కేంద్రాల దగ్గరకు వచ్చి ఉన్నారు. అట్టి వ్యక్తులను నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలోనికి అనుమతించేది లేదు. బోర్డర్ వద్దకు వచ్చిన వారికి నిబంధనల మేరకు కచ్చితంగా రెండు వారాలపాటు క్వారంటైన్ నిర్వహించిన తరువాతే రాష్ట్రంలోకి అనుమతిస్తాం. లాక్ అవుట్ ఉదేశం ఒక మనిషి నుంచి మరొక మనిషికి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అంటు వ్యాధి సంక్రమించకండా ఉండేలాగా చేయడమే. బయట ప్రాంతాల నుంచి ఆంధ్ర ప్రదేశ్ లోనికి అనుమతించడం మన లాక్ అవుట్ ఉద్దేశాన్ని నీరు గార్చటమే. దయచేసి అట్టి వ్యక్తులు ఆర్థం చేసుకోగలరని మనవి’ అని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.

లాక్‌డౌన్ ప్రకటించిన వేళ తెలంగాణ నుంచి వేలాది మంది సొంత వాహనాలు, బైక్‌లు, కార్లు తీసుకుని ఏపీలోని తమ సొంతూళ్లకు వెళ్లిపోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తెలంగాణలోని కొందరు పోలీసులు వారికి NOCలు ఇచ్చారు. ఆ లెటర్లను పట్టుకుని వెళ్లిన వారికి నిరాశ ఎదురైంది. తెలంగాణ - ఏపీ సరిహద్దుల్లోని గరికపాడు, దామరచర్ల లాంటి ప్రాంతాల్లో ఏపీ పోలీసులు వారిని రానివ్వకుండా నిలిపివేశారు. దీంతో నిన్న అర్ధరాత్రి నుంచి ప్రజలు రోడ్లు మీద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు తెలంగాణ పోలీసులు ఇచ్చిన లేఖను చూపించినా వారు నో ఎంట్రీ అనడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

అర్ధరాత్రి నుంచి తమను రోడ్డు మీద ఆపేశారని, పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్నారని చెప్పినా వినడం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి సమస్యలను ముందుగానే చర్చించుకుని ఓ నిర్ణయానికి రావాలని, అర్ధరాత్రి నుంచి తమను రోడ్డు మీద నిలబెడితే ఎలా అంటూ మండిపడ్డారు. అయితే, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వబోమని, ఏపీలోకి వచ్చినా కనీసం 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటామంటేనే అనుమతిస్తామని స్పష్టం చేస్తున్నారు. నూజివీడులోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను క్వారంటైన్ కేంద్రంగా వినియోగించనున్నారు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు