NO CORONA VIRUS SECOND WAVE IN TELANGANA MINISTER ETELA RAJENDAR CLARIFIES AK
Telangana: కరోనా సెకండ్ వేవ్‌పై తెలంగాణ మంత్రి క్లారిటీ
ప్రతీకాత్మక చిత్రం
Telangana: బ్రిటన్ నుంచి వచ్చినవారికి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపిన మంత్రి ఈటల.. వారిలో కరోనా పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను సీసీఎంబీకి పంపించామని తెలిపారు.
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ మొదలైందనే ఊహాగానాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈటల రాజేందర్ ఖండించారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ లేదని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణలో కరోనా ఫస్ట్ వేవ్ కూడా తగ్గముఖం పట్టిందని తెలిపారు. కొందరు దీనిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రకమైన ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు సూచించారు. బ్రిటన్ నుంచి వచ్చినవారికి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపిన మంత్రి ఈటల.. వారిలో కరోనా పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను సీసీఎంబీకి పంపించామని తెలిపారు.
ఇప్పటివరకు వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఉష్ణోగ్రతలు పెరిగితే కరోనా మొదటి దశ అంతమయ్యే అవకాశం ఉందని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాక్సిన్ వచ్చిన వెంటనే 10 వేల మంది సిబ్బందికి శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఆ తరువాత రోజుకు 10 లక్షల మందికైనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
మూడు రోజుల క్రితం కొత్త రకం వైరస్ గురించి ఈటల రాజేందర్ ఊరట కలిగించే విషయం చెప్పారు. బ్రిటన్ నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్న కొత్త రకంగా కరోనా వైరస్ ప్రాణాంతకం కాదని.. ఈ కొత్త రకం వైరస్ శరవేగంగా విస్తరించే లక్షణం కలిగి ఉందని.. ప్రాణాంతకం కాదని వివరించారు. ఈ వైరస్ విషయంలో ప్రజలు భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. కొత్త రకం వైరస్‌పై కేంద్రం అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా వుందని ఈటల రాజేందర్ తెలిపారు. చలికాలం కాబట్టి ఈ వైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని.. ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం కొత్త రకంగా కరోనా వైరస్‌పై మరింత అధ్యయనం చేస్తోందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.