Andhra Pradesh: ఈ ఊరిలో కరోనా లేదు.. ఎప్పటికీ రాలేదు.. ఏం చేస్తున్నారు? ఈ గ్రామం ఎక్కడుందో తెలుసా

కరోనా లేని గ్రామం

కరోనా లేని గల్లీ ఉందా.. అంటే చెప్పడం చాలా కష్టం.. అసలు కరోనా కేసు లేని గ్రామం అంటూ ఎక్కడైనా ఉందా? వెతికినా దొరికే పరిస్థితి లేదేమో అనుకుంటున్నారా? ఒక ఊరు మాత్రం కరోనాకు దూరంగా ఉంటోంది. ఇప్పుడే కాదు తొలి దశలోనే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇక ఎప్పటికీ కరోనా తమ దగ్గరకు రాదు అంటున్నారు.

 • Share this:
  కరోనా.. కరోనా.. ఎవరి నోట విన్న ఇదే మాట.. ఎవరిని కదిపినా అదే భయం.. చిన్నా పెద్దా అంటూ వయసుతో సంబంధం లేదు. పేద ధనిక అనే తేడా లేదు. ఆ వర్గం ఈ వర్గం అని బేధం లేదు.. ఎవ్వరినీ కరోనా వదలడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రెటీలను సైతం భయపెడుతోంది. మొదట పట్టణాలకే అధికంగా పరిమితమైన కరోనా వైరస్.. ఇప్పుడు పల్లెలను వదలడం లేదు. దాదాపు రాష్ట్రా వ్యాప్తంగా చాలా గ్రామాలకు కరోనా విస్తరిస్తోంది. అయితే చాలా గ్రామాల్లో పరీక్షలు నిర్వహించుకోడానికి అక్కడి ప్రజలు ముందుకు రావడం లేదు. కానీ చాలా గ్రామాల్లో వాస్తవ పరిస్థితులు చూస్తే ఊళ్లో సగానికి పైగా ప్రజలు కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. భయపడి పరీక్షలు చేసుకుంటున్న కొంతమందికి మాత్రం కరోనా నిర్ధారణ అవుతోంది. ఇప్పటికే చాలా గ్రామాలను కరోనా చుట్టేసింది..

  గ్రామాలను సైతం కరోనా కబళిస్తున్న వేళ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది ఓ గ్రామం. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం దిగువ చెర్లోపల్లిలో ఒక్క కరోనా కేసులు కూడా నమోదు కాలేదు. అసలు ఆ ఊళ్లో అందరూ చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఒక్కరు కూడా ఎలాంటి అనారోగ్యం లేకుండా సంతోషంగా ఉంటున్నారు. అందుకే ఇప్పుడు ఊరి నుంచి కాలు బయట పెట్టకుండా నిశ్చింతగా జీవిస్తున్నారు. ఈ పంచాయతీ పరిధిలో సాతార్లపల్లి, గంగిరెడ్డిపల్లి, దిగువ చెర్లోపల్లి గ్రామాలుండగా.. కరోనా మొదటి, రెండో దశలోనూ ఒక్క కేసూ ఇక్కడ నమోదు కాలేదు అంటే నమ్మగలరా..? కానీ అదే నిజం.. ఇక్కడ ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

  గ్రామ పంచాయతీ జనాభా దాదాపు రెండు వేల మంది ఉన్నారు. విద్యార్థులంతా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోనే విద్యను అభ్యసిస్తున్నారు. ఏ సమస్య అంతా ఒకదగ్గర చర్చించుకుని సచివాలయంలోనే సమస్యను పరిష్కరించుకుంటున్నారు. సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో గ్రామానికి చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాలకు, పట్టణాలకు వెళ్లడం లేదు. అందువల్లే వైరస్‌ బారిన పడకుండా తమను తాము కాపాడుకుంటున్నారు గ్రామస్తులు.

  దిగువ చెర్లోపల్లి పంచాయతీ పరిధిలోని వారంతా వేరుశనగ, కంది, వరి, మొక్కజొన్న, బంతి పూలు, తీగ జాతి కూరగాయ పంటల్ని అధికంగా సాగుచేస్తారు. దాదాపు అందరికీ దేశవాళీ ఆవులు, గేదెలు, ఎద్దులున్నాయి. వాటి నుంచి వచ్చే పేడ, అక్కడ దొరికే ఆకులతో తయారైన ఎరువులనే మాత్రమే పంటలకు ఉపయోగిస్తున్నారు. అసలు రసాయన ఎరువుల వాడకం ఉండదు అంటున్నారు.

  ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే రసాయన ఎరువులు వాడకూడదని వారు నిర్ణయించుకున్నారు. అందుకే ఊళ్లో పండిన పంటలన మాత్రమే తింటూ.. కాలు బయట పెట్టకుండా మంచి జీవనం సాగిస్తున్నారు. ఆఖరికి చికెన్‌ తినాలన్నా.. గ్రామంలో సొంతంగా పెంచుకున్న నాటు కోళ్లనే వినియోగిస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published: