పేదల చేతిలో డబ్బులు పెట్టడం ఒక్కటే పరిష్కారం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ కోసం కేంద్రం రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి న్యూస్18కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘పేదలకు సాయం చేయడానికి అదొక్కటే పరిష్కారం కాదు. పేదల చేతికి నేరుగా డబ్బు ఇవ్వాలని చాలా మంది ఆర్థిక వేత్తలు, పరిశీలకులు చెప్పిన మాటలు మేం కూడా విన్నాం. అయితే, ప్రభుత్వం మాత్రం మరో మార్గాన్ని అనుసరించింది. వ్యవస్థను పటిష్టం చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత కేంద్రం ప్రకటించిన తొలి ప్యాకేజీ పేదలకు నేరుగా లబ్ధి చేకూర్చేదేనని స్పష్టం చేశారు. పేదల ఖాతాల్లో డబ్బులు వేయడం, ఆహార ధాన్యాలు అందించడం ఉద్దేశం అదేనన్నారు. అందుకే రెండో ప్యాకేజీ రూపం మార్చినట్టు చెప్పారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ప్రధానంగా సులువైన రుణాలు, గ్రామీణ ఉపాధి కల్పించే వాటికి నిధులు, చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న సంస్కరణలను తీసుకొచ్చారు. అయితే, కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్లలో ప్రభుత్వం ఇచ్చేది చాలా తక్కువ మొత్తమేనని విమర్శకులు అభిప్రాయపడ్డారు. రూ.20లక్షల కోట్లలో ప్రభుత్వం ఇచ్చేది కేవలం 10 శాతం మాత్రమేనన్నారు.
వలస కార్మికులను ఆదుకునే అంశంపై స్పందించిన నిర్మలా సీతారామన్ విపత్తు నిర్వహణ నిధులను నేరుగా వినియోగించుకునే వెసులుబాటు ఉందన్నారు. వలస కార్మికులకు క్యాంప్లు ఇతరత్రా అత్యవసర అవసరాల కోసం వాటిని వినియోగించుకోవచ్చన్నారు. ‘ఆ అంశాలను రాష్ట్రాలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాయి. కాబట్టి ఏ నిధులు ఎక్కడ వాడాలని వారికి క్లారిటీ ఉంటుంది.’ అని నిర్మలా సీతారామన్ అన్నారు. కరోనా వైరస్ సోకుతుందన్న భయంతోనే వలస కార్మికులు నగరాలు వదిలి తమ సొంత గ్రామాలకు వలస పోతున్నారని నిర్మలా సీతారామన్ చెప్పారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.