ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన మూడో విడుత వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ రోజు ప్రధానంగా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, మత్స్య సంపద, వన సంపద, పశు సంపద, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం 11 అంశాలను వివరించారు. అందులో 8 వ్యవసాయం, ఇతర రంగాలకు సంబంధించిన మౌలిక వసతుల కల్పన, రవాణా వంటివి. మిగిలిన మూడు పరిపాలనా పరమైన సంస్కరణలను ప్రకటించారు.
వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారు, వాటిని స్టోరేజ్ చేసుకోవడానికి, ధాన్యం కోతల తర్వాత ప్రాసెసింగ్ చేసుకోవడానికి, వ్యవసాయ సంబంధిత మౌలిక వసతుల కల్పన కోసం రూ.లక్ష కోట్లను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ధాన్యాన్ని నిల్వ చేయడానికి, కొనుగోలు చేసి ఎగుమతులు చేసే వారికి ఇది ఉపయోగపడనుంది.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం రూ.10వేల కోట్లను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. స్థానిక కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తారు. మహిళలకు మరింత ప్రాధాన్యం ఉంటుంది. హెల్త్, వెల్ నెస్, న్యూట్రిషన్, హెర్బల్, ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రాసెసింగ్ చేసే వారికి లబ్ధి జరగనుంది. దీని ద్వారా 2 లక్షల సంస్థలకు లబ్ధి జరుగుతుంది.
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకొస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని వల్ల ఫిషరీస్, ఆక్వా కల్చర్లో 55 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. అలాగే, మత్స్య సంపద ఎగుమతి పెరుగుతుందని చెప్పారు. రూ.లక్ష కోట్ల వరకు పెరుగుతుందన్నారు. ఆక్వా కల్చర్లో ల్యాబ్, పెంపకంలో సూచనలు చేస్తామన్నారు. చేపల వేట నిషేధం సమయంలో బోటుకి, బోటు యజమానికి కూడా ఇన్సూరెన్స్ కవర్ చేస్తామన్నారు. వచ్చే ఐదేళ్ల పాటు ఇది అమల్లో ఉంటుందని చెప్పారు.
దేశంలో 53 కోట్ల పశు సంపద ఉందని, వాటన్నిటికీ ఎలాంటి రోగాలు రాకుండా వ్యాక్సినేషన్ చేయిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే, పశుగ్రాసం ఉత్పత్తికి, ఎగుమతులకు భారీ ఎత్తున వ్యాపార అవకాశాలు ఉన్నాయన్నారు. పశుగ్రాసం ఉత్పత్తి కోసం రూ.15,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.