Lockdown: ఒకే ఒక్క కరోనా కేసు.. దేశం మొత్తం లాక్‌డౌన్ అమలు.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

Lockdown: పాఠశాలలు, కార్యాలయాలు, వ్యాపారాలు మూసివేయబడతాయని.. అవసరమైన సేవలు మాత్రమే పనిచేస్తాయని న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రకటించింది.

  • Share this:
    న్యూజిలాండ్‌లో మళ్లీ దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించారు ఆ దేశ ప్రధానమంత్రి జసిందా ఆర్డెర్న్. దేశంలోని ప్రధాన నగరం ఆక్లాండ్‌లో ఒక కరోనా కేసు వెలుగు చూడటంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాధ్యమైనంత తొందరగా ఈ రకమైన చర్యలు తీసుకోవడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రభుత్వం పేర్కొంది. బుధవారం నుండి కనీసం మూడు రోజుల పాటు న్యూజిలాండ్ మొత్తం కఠినమైన లాక్‌డౌన్ అమలులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సోకిన వ్యక్తి గడిపిన తీరప్రాంత పట్టణం, ఆక్లాండ్, కోరమాండల్ ఏడు రోజుల పాటు లాక్‌డౌన్‌లో ఉండనుంది. వీలైనంత త్వరగా దీని నుండి బయటపడటానికి ప్రజలంతా కష్టపడాల్సి ఉంటుందని ప్రధాని ఆర్డెర్న్ తెలిపారు.

    పాఠశాలలు, కార్యాలయాలు, వ్యాపారాలు మూసివేయబడతాయని.. అవసరమైన సేవలు మాత్రమే పనిచేస్తాయని న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త కేసు నమోదు, లాక్‌డౌన్ ప్రకటనతో సూపర్ మార్కెట్లు ఒక్కసారిగా కిక్కిరిసిపోయాయి. దేశంలోని వెలుగుచూసిన కరోనా కొత్త కేసుకు డెల్టా వేరియంట్ కారణం కావొచ్చని న్యూజిలాండ్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలని, అవసరమైన సేవలకు మాత్రమే వెళ్లాలని ప్రధాని ఆర్డెర్న్ చెప్పారు.

    ఇంటి నుండి బయలుదేరినప్పుడు అన్ని సమయాల్లో రక్షణాత్మక మాస్క్‌లు ధరించాలని సూచించారు. న్యూజిలాండ్‌లో చివరిగా ఫిబ్రవరిలో కరోనా కేసు గుర్తించారు. కరోనా డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరమనే విషయం ఇతర దేశాల అనుభవం ద్వారా తెలుస్తుందని అన్నారు. లాక్‌డౌన్ ప్రకటించిన తరువాత న్యూజిలాండ్ డాలర్ 1.5% తగ్గి 0.6926 డాలర్లకు పడిపోయింది.
    Published by:Kishore Akkaladevi
    First published: