news18-telugu
Updated: October 16, 2020, 11:10 AM IST
నాయిని నరసింహారెడ్డి(ఫైల్ ఫొటో)
దేశాన్ని కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం వైరస్ బారిన పడుతున్నారు. వైరస్ సోకిన అనేక మంది కోలుకున్నా.. కొందరికి సీరియస్ గా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తెలంగాణ తొలి హోం మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాయిని నరసింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించింది. సెప్టెంబర్ 28న ఆయనకు కరోనా సోకింది. అప్పటి నుంచి ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పటల్ లో చేరి చికిత్స పొందుతున్నారు. ఎప్పుడు యాక్టీవ్ గా, శారీరకంగా స్ట్రాంగ్ గా కనిపించే నాయిని త్వరలోనే కోలుకుంటారని అంతా భావించారు. అనుకున్నట్లుగానే ఆయనకు వారం క్రితం మరో సారి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటీవ్ కూడా వచ్చింది. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ కూడా అవుతారని అంతా భావించారు.
అయితే ఏమైందో ఏమో కానీ ఒక్క సారిగా ఆయన ఆరోగ్యం విషమించింది. ఊపిరి తీసుకోవడమే ఇబ్బందిగా మారింది. దీంతో వైద్యులు టెస్టులు చేయగా ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకి న్యుమోనియా వచ్చిందని గుర్తించారు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం కోసం ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నాయినిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
కుటుంబ సభ్యులందరికీ సోకిన వైరస్..
నాయిని నరసింహారెడ్డి భార్య అహల్య సైతం కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమె సైతం బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆమెకు నెగటీవ్ వచ్చిందని సమాచారం. నాయిని అల్లుడు, రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆయన పెద్ద కుమారుడికి సైతం కరోనా సోకింది. అయితే వారు కోలుకుంటున్నారని సమాచారం.
Published by:
Nikhil Kumar S
First published:
October 16, 2020, 10:15 AM IST