KTR: కరోనా వ్యాక్సినేషన్‌లో మోదీ ప్రభుత్వం విఫలం.. కేంద్రంపై మంత్రి కేటీఆర్ విమర్శలు

ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రి కేటీఆర్

వాక్సినేషన్ విషయంలో ఏజ్ గ్రూపుల వారీగా నిర్ణయం తీసుకోవడం అయోమయానికి దారితీస్తుందని, దీని బదులు తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధంగా సూపర్ స్పైడర్‌లను గుర్తించి వారికి వాక్సినేషన్ వేస్తే బాగుండేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

  • Share this:
    కరోనా వ్యాక్సినేషన్‌లో కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమంపై ప్రజల నుంచి సలహాలను, సూచనలను మంత్రి కేటీఆర్ స్వీకరించారు. 'ఆస్క్ కేటీఆర్' పేరుతో కొనసాగిన ట్విట్టర్ సంభాషణలో పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తు, ప్రజల నుంచి వచ్చిన విలువైన సలహాలు, సూచనలు పైన స్పందించారు కేటీఆర్. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించిన పలు అంశాలను ప్రజలకు వివరించారు. తెలంగాణలో వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నదని, ఓల్డ్ ఏజ్ హోమ్‌ల్లోనూ టీకాలు వేస్తున్నామని తెలిపారు. రోజుకు 10 లక్షల మంది ప్రజలకైనా టీకాలు వేసే సామర్థ్యం మనకుందని.. ఐతే అవసరమైన వ్యాక్సిన్ సరఫరా లేదన్నారు కేటీఆర్. రాష్ట్ర ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్లను సమకూర్చు కునేందుకు  రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అయితే దురదృష్టవశాత్తు రాష్ట్రం పిలిచిన గ్లోబల్ టెండర్లకు స్పందన రాలేదని చెప్పారు.

    వాక్సినేషన్ విషయంలో ఏజ్ గ్రూపుల వారీగా నిర్ణయం తీసుకోవడం అయోమయానికి దారితీస్తుందని, దీని బదులు తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధంగా సూపర్ స్పైడర్‌లను గుర్తించి వారికి వాక్సినేషన్ వేస్తే బాగుండేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు 30 లక్షల మందిని గుర్తించిందని, వారికి సంబంధించిన వాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ముఖ్యంగా విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు వెళ్లే వారి కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం ద్వారా వారి విలువైన విద్యా సమయం సేవ్ అవుతుందన్నారు కేటీఆర్. ప్రజలకు 2 డోసుల వ్యాక్సిన్ అందించే కార్యక్రమం కొనసాగిస్తున్నామని.. ఇప్పటికే 13 లక్షల మందికి రెండో డోసు పూర్తి అయింది అన్నారు. ఇప్పటి వరకు సుమారు 65 లక్షల మందికి వాక్సిన్ అందించామని అన్నారు.

    దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లు 85 శాతం కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉన్నాయని మిగిలిన 15 శాతంలో రాష్ట్రాలకు తక్కువ రేటు, ప్రైవేట్ ఆస్పత్రులకు ఎక్కువ రేటు నిర్ణయించడంతో కంపెనీలు కూడా ప్రైవేటు వర్గాలకే అమ్మేందుకు ముందుకు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. మూడవ కరోనా నేపథ్యంలోనూ కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు సరఫరాకు సంబంధించిన ఒక ప్రణాళిక ఉందా లేదా అన్న అనుమానం కలుగుతుందన్నారు. భారత దేశంలో ప్రస్తుతం వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సిరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ నెలకి పది కోట్లకు మించి ఉత్పత్తి చేయలేవని, అయితే త్వరలోనే దేశ జనాభాలో 80శాతం ఉన్న 18 నుంచి 45 సంవత్సరాల వయసున్న ప్రజలకు ఏ విధంగా రెండు డోసులు అందుతాయో కేంద్ర ప్రభుత్వం తెలపాని ఆయన డిమాండ్ చేశారు.

    అమెరికా, కెనడా, డెన్మార్క్, నార్వే వంటి దేశాల్లో నిరుపయోగంగా ఉన్న 50 కోట్ల వ్యాక్సిన్లకు సంబంధించి ఆయా దేశాలతో వెంటనే చర్చను ప్రారంభించి వాటిని భారతదేశానికి తరలించే ప్రక్రియను ప్రారంభించాలని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఇతర దేశాలు తమ ప్రజలకి పెద్దఎత్తున వ్యాక్సిన్ సరఫరాను అందించే ప్రయత్నం చేస్తుంటే భారత సర్కారు మాత్రం వ్యాక్సిన్ మైత్రి మరియు విదేశాలకు వాక్సిన్ ఎగుమతుల ప్రమోషన్ లకు సంబంధించిన అంశాలపై దృష్టి కేంద్రీకరించి ఉందన్నారు. అమెరికా కెనడా వంటి దేశాలు తమ దేశ జనాభాకు అవసరమైన వాటి కన్నా ఎక్కువగానే వ్యాక్సిన్లను ప్రోకూర్  చేసుకున్నాయని, ముఖ్యంగా కెనడా లాంటి దేశం ఒక వ్యక్తికి తొమ్మిది డోసు ల చొప్పున వ్యాక్సిన్లకు ఆర్డర్ ఇచ్చిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. అమెరికా ఇజ్రాయిల్ లాంటి దేశాలు సగానికి పైగా జనాభ కి వ్యాక్సిన్ అందిస్తే భారతదేశ వ్యాక్సిన్ ప్రక్రియ కనీసం 10  శాతం కూడా దాటలేదన్నారు కేటీఆర్.

    తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సిన్ వేస్టేజ్ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పుడు అతి తక్కువగా ఉందన్నారు. ఒకవేళ థర్డ్ వేవ్ కరోనా వస్తే పిల్లల పైన అత్యధిక ప్రభావం చూపుతుందన్న భయాందోళన నేపథ్యంలో వారికి వ్యాక్సిన్ ఏమైనా అందుబాటులోకి వస్తుందా అన్న ప్రశ్నకు కేటీఆర్ సమాధానం చెప్పారు. మనదేశంలో పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ ఇటీవలే ప్రారంభమయ్యాయని తెలిపారు.
    Published by:Shiva Kumar Addula
    First published: